అదృష్టం అన్ని వేళలా పనికి రాదు. ఎవరి. కష్టం వారు చేయాలి. కష్టపడను. ఇంట్లో కూర్చుంటాను.. జనాలు ఓట్లేస్తే మళ్లీ అధికారంలోకి వస్తా. లేదంటే లేదు అనే మిట్ట వేదాంతం వల్లిస్తే, జగన్ ఎప్పటికీ మరోసారి సిఎమ్ కాలేరు.
మొదటి సారి జగన్ సిఎమ్ అయ్యింది నవరత్నాల హామీ ఇచ్చి. జనాల్లోకి నేరుగా వెళ్లి జనాలను పలకరించి. కానీ జనాలకు అర్థం అయింది జగన్ పాలన బాలేదని, లేదా జగన్ కు పాలన రాదని. జనాలకు అలాగే అర్ధం అయిందా..లేక జనాలకు అలా చేరవేసారా.. అన్నది వేరే సంగతి. జనాల్ని మళ్లీ తన దారికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే జగన్ కు వుంది. రాజకీయాలు చేస్తాను. అధికారం కావాలి అనుకుంటే. అబ్బే.. అదేం అవసరం లేదు. ఒకసారి సిఎమ్ అయ్యాను. అది చాలు అనుకుంటే అది వేరే సంగతి. అదేదో క్లారిటీగా చెప్పేస్తే పార్టీని నమ్ముకున్నవారంతా ఎవరి దారి వారు చూసుకుంటారు.
అంతే తప్ప చంద్రబాబు ఫెయిల్ అవుతారు. అప్పుడు జనం మళ్లీ తన దగ్గరకే వస్తారు. అంతవరకు సైలంట్ గా వుందాం అనుకుంటే రాజకీయం చేయడం చాతకాదు అనుకోవాలి. అయిదేళ్లలో ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు. తన మనసులో మాట చెప్పింది లేదు.. అధికారంలోకి వున్నపుడు నడిచిపోయింది. కానీ ఇప్పుడు అధికారం లేదు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ పాలనను వదిలిపెట్టడం లేదు. నిత్యం బట్టలు విప్పదీస్తున్నారు. ఆర్థిక అవినీతి, పోలవరంలో అసమర్ధత ఇలా ఒక్కొటీ బయటకు తీస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా దుకాణం కట్టేసింది. కానీ జనసేన, తేదేపా సోషల్ మీడియా జనాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. పొరపాటున ఎవరైనా వైకాపా సానుభూతి పరుడు ఓ పోస్ట్ పెడితే అందరూ విరుచుకుపడి పోతున్నారు. మద్దతు ఇచ్చే వారే లేరు.
చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆర్ధిక పరిస్థితి మీద మాట్లాడినపుడు కానీ, పోలవరం గురించి చెప్పినపుడు కానీ సాక్షి లో కౌంటర్లు వేసుకోవడం కాదు. జగన్ ముందుకు రావాలి. మీడియా దగ్గర కూర్చుని చంద్రబాబు చెప్పింది నిజమా కాదా అన్నది నిగ్గు తేల్చాలి. అవసరం అయితే నిప్పులు చెరగాలి.
అలా చేయకుండా బెంగుళూరు వెళ్లిపోతే ఏమనుకుంటారు. అయిదేళ్ల పాటు చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని రాజకీయం చేయలేదా? తాను బెంగళూరు నుంచి చేయలేనా? అని అనుకుంటున్నారేమో? అలా ఎన్నిటికీ సాధ్యం కాదు. చంద్రబాబు వెనుక ఓ బలమైన వర్గం వుంది. బలమైన మీడియా వుంది. బలమైన వివిధ పార్టీలు వున్నాయి.
ఇప్పుడు చంధ్రబాబు మారారు. కాపులను బిసి లను చెరో వైపు పద్దతిగా వుంచకుంటున్నారు. ప్రతి ఒక్క నిర్ణయం ఆచి తూచి తీసుకుంటున్నారు. అందువల్ల బెంగళూరులో కూర్చుని చంద్రబాబు తప్పులు చేస్తారేమో అని చూస్తూ వుండడం సరి కాదు. ఆయన తప్పులు చేయడం అలా వుంచితే జగన్ తప్పులు అన్నీ లాగుతున్నారు.
అందువల్ల జగన్ ను నమ్ముకుని ఇంకా రాజకీయాలు చేయాలనుకున్న వారు ఆలోచించుకోవాల్సిందే.
The post జగన్ మరి కష్టమే.. ఇలా అయితే! appeared first on Great Andhra.