రాజకీయంగా వైఎస్ జగన్ సరైన అడుగులే వేస్తున్నారా? అంటే… వైసీపీ నాయకులు ఔనని అంటున్నారు. బీజేపీ వైఖరిపై వైసీపీ తీవ్ర ఆగ్రహంతో వుంది. గత ఐదేళ్లు రాజకీయ అవసరాలకు తమను వాడుకుని, మరోవైపు టీడీపీతోనూ బీజేపీ అంటకాగిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి భారీ ప్రయోజనం కలిగించిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మోదీ సర్కార్ తమకు చేసేదేమీ లేదనే నిర్ణయానికి వైసీపీ నేతలు వచ్చారు.
మరోవైపు జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రాభవం తగ్గడాన్ని కూడా వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇదే సందర్భంలో ఇండియా కూటమికి రాజకీయంగా అన్నీ కలిసొస్తున్న వాతావరణం కనిపిస్తోంది. దీంతో రాజకీయంగా ఒంటరి కావడం మంచిదని కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీ ధర్నాకు అన్ని పార్టీల్ని వైసీపీ ఎంపీలు ఆహ్వానించారు.
మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ పార్టీలకు చెందిన ఎంపీలతో పాటు దేశ వ్యాప్తంగా పలుపార్టీలకు చెందిన నాయకులు ధర్నాకు సంఘీభావం తెలపడంపై వైసీపీలో ఆనందం వ్యక్తమవుతోంది. జగన్‌కు అండగా నిలిచిన వారంతా ఇండియా కూటమి నేతలే కావడం విశేషం. ఇండియా కూటమితో జట్టు కట్టాలనే డిమాండ్ వైసీపీలో అంతర్గతంగా వుంది. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి వెళ్లడం వల్ల ఏపీలో వైసీపీకి చాలా ప్రయోజనాలున్నాయని వైసీపీ నాయకుల భావన.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణించడం వల్ల ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లలో చీలిక వుండదని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు ఆందోళన కలిగించే రీతిలోనే మైనార్టీల ఓట్లు పడ్డాయని వైసీపీ గుర్తించింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే పాజిటివిటీ తమకు ఉపయోగపడుతుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఉదాహరణకు కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వుంటే, రాష్ట్రంలో రైతు రుణమాఫీ లాంటి వాటికి కలిసొస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
మోదీ సర్కార్ ఆగ్రహానికి గురైతే, కేసులు, ఇతరత్రా ఇబ్బందులు తప్పవనే భయం లేకపోలేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినా కేసులు తప్పవనే వాదన కూడా వైసీపీలో లేకపోలేదు. ఇబ్బందులున్నా తాను రాజకీయంగా ఒంటరి కాదన్న భావన, బరిలో నిలిచి ప్రత్యర్థులతో పోరాడేందుకు నైతిక స్థైర్యాన్ని ఇస్తుందనే చర్చకు తెరలేచింది. అన్నింటికి మించి వైసీపీ ఓటు బ్యాంక్ చెక్కు చెదరదని వైసీపీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఏ రకంగా చూసినా రాజకీయంగా ఇండియా కూటమితో వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వైసీపీలో బలంగా వుంది. రానున్న రోజుల్లో జగన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.