కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టింది. మోదీ సర్కార్ ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించడంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలు అంతన్నారు, ఇంతన్నారు. చివరికి బడ్జెట్‌లో రాష్ట్రానికి అప్పుల హామీ తప్ప, ప్రయోజనం శూన్యం అనే నిట్టూర్పు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా విపక్ష నాయకులు బడ్జెట్‌పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. బడ్జెట్‌పై నోరు తెరవని ఏకైక విపక్ష నాయకుడు బహుశా వైఎస్ జగన్ మాత్రమే. రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకున్న వారెవరైనా బడ్జెట్‌పై స్పందించకుండా వుండరు. అంతెందుకు తెలంగాణకు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకునే ప్రతిపక్ష పార్టీ నాయకులెవరైనా ఇదే పని చేస్తారు.
అదేంటో గానీ, జగన్ మాత్రం కాస్త భిన్నంగా, విచిత్రంగా కనిపిస్తున్నారు. పాలక పక్షం కోరుకునేది కూడా ఇలాంటి ప్రత్యర్థినే. అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్ల అప్పు ఇప్పించడానికి సహకరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో పేర్కొన్నారు. పోలవరంతో పాటు ఇతరత్రా ఏ ప్రాజెక్టుకూ స్పష్టమైన హామీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు.
ఈ విషయాలపై జగన్ ఎందుకు స్పందించరో ఎవరికీ అర్థం కాదు. ఇంత అధ్వానమా? అనే ప్రశ్న సొంత పార్టీ నేతల నుంచి కూడా వస్తోంది. ఎలాంటి వాటిపై తక్షణమే స్పందించాలో కూడా జగన్‌కు తెలియకపోతే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇలాగైతే వైసీపీ మనుగడ ఎలా సాధ్యమో వారికే తెలియాలి.