దిశ, ఫీచర్స్ : సరైన జోడీ కోసం డేటింగ్ యాప్‌లో, సోషల్ మీడియా వేదికల్లో సెర్చ్ చేస్తున్న పరిమితను ఓ ప్రొఫైల్ ఆకర్షించింది. మరింత స్ర్కోల్ చేయగా అతని పేరు అనిరుద్ అని తెలిసింది. తన ప్రొఫైల్ లింక్ కూడా షేర్ చేసి వివరాలు వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దరూ ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ అవుతూ వచ్చారు. మాటలు, అభిప్రాయాలు కలవడంతో డేటింగ్ ప్రారంభించి పెళ్లి చేసుకున్నారు. దీనిని బట్టి సంబంధాల విషయంలో సోషల్ మీడియా పాత్రను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒకే విధంగా లేదని, డేటింగ్‌లు మొదలు బ్రేకింగ్‌లు, విడాలకుల వరకు రిలేషన్‌షిప్స్‌పై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతోందని నిపుణులు చెప్తున్నారు.
పోస్టింగ్‌లు, షేరింగ్‌లు
నిజానికి సోషల్ మీడియా ప్రభావం అందరి విషయంలో ఒకేలా ఉండటం లేదని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు ‘ఒకప్పుడు సోషల్ మీడియాలో పరిచయమై పెళ్లి చేసుకున్న వరుణ్, అలవి అనే దంపతులు ఇప్పుడు ఆర్నెల్ల తర్వాత విడాకులకు రెడీ అయ్యారు. కారణం.. భర్త సోషల్ మీడియా అకౌంట్‌లో తాము కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేయకపోవడమే’’ అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్ కరుణాకర్. అలా చేయడం లేదంటే భర్తకు తనమీద ప్రేమ లేదని, ఏదో దాస్తున్నాడని ఇక్కడ అలవి అనుమానించిందని, ఈ క్రమంలో స్టార్ట్ అయిన చిన్న గొడవ చివరికి ఇద్దరి మధ్య తీవ్రస్థాయి విభేదాలకు, ఆ తర్వాత విడాకులకు దారితీసిందని చెప్తున్నారు. దీనిని బట్టి సంబంధాలపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలు ఉంటాయనే విషయం కూడా అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.
రెండు విధాలుగా ఎఫెక్ట్..
ఒక్కరో ఇద్దరో కాదు, ఈ మధ్య చాలామంది సోషల్ మీడియా కారణంగా చిన్న చిన్న విషయాలకే బ్రేకప్‌లు, విడాకులు వంటి నిర్ణయాలను తీసేసుకుంటున్నారు. అయితే ఈ తగాదాలు సహజమే కానీ, అంత మాత్రాన సంబంధాల్లో నమ్మకాన్ని, గౌరవాన్ని దెబ్బతీయవని కూడా కొందరు చెప్తుండగా.. ‘అవన్నీ ఒకప్పుడు.. ప్రస్తుత డిజిటల్ యుగంలో రిలేషన్‌షిప్ డైనమిక్స్ మారుతున్నాయి’ అంటున్నారు ఇంకొందరు నిపుణులు. ఉదాహరణకు అవి వ్యక్తుల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి వంటి సంబంధాలకు కారణం అవుతున్నాయని, ఇంకొన్ని సందర్భాల్లో సమస్యలు, సవాళ్లు, సంబంధాల్లో తెగతెంపుకు కూడా వేదికలవుతున్నాయని పేర్కొంటున్నారు.
భద్రతతోపాటు సమస్యలు కూడా..
ఇప్పుడు సోషల్ మీడియా చాలా మంది జీవితంలో ఓ భాగమైపోయింది. అక్కడ గుర్తింపు, అవకాశాలు వంటివి క్రియేట్ అవడం మాత్రమే కాకుండా రిలేషన్‌షిప్స్‌పై కూడా ఏదో ఒక రూపంలో ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. కొందరు తమ సంబంధం గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని, నలుగురితో పంచుకోవడాన్ని కొందరు కంఫర్టుగా, లైఫ్ సెక్యూరిటీగా ఫీలవుతున్నారు. భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే సోషల్ మీడియా పోస్టులు ఎవిడెన్స్‌గా ఉపయోగపడతాయన్న నమ్మకం వారిని సోషల్ మీడియా వేదికలవైపు మొగ్గు చూపేలా ప్రేరేపిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాంటప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భాగం కాకపోతే తమకు ఉనికి లేకుండా పోతుందని, ఇతరులు అమాయకులుగా కూడా ముద్ర వేస్తారనే భావన నేటి యువతీ యువకులను వెంటాడుతోంది.
ప్రమాద సంకేతం.. పరిష్కార మార్గం
ఒక నివేదిక ప్రకారం.. 18 నుంచి 35 ఏండ్లలోపు వయస్సుగల ప్రతీ పది మందిలో ఇద్దరు సోషల్ మీడియా వేదికల్లో పరిచయమైన తర్వాత గొడవ పడటం, విడిపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇక లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు, భార్య భర్తల విషయంలోనూ ఇది వ్యక్తిగత, వైవాహిక భద్రతకు, ఆత్మ విశ్వాసానికి కారణం అవుతుండగా, మరోవైపు కొందరిలో సోషల్ మీడియాలో కామెంట్లు, అనుమానాలు, విమర్శలు వంటివి భార్యా భర్తల మధ్య గొడవలకు, అభద్రతకు, విభేదాలకు, చివరికి విడాకులకు కూడా కారణం అవుతున్నాయి. అయితే పరస్పరం చర్చించుకోవడం, భాగస్వాముల మధ్య సరైన కమ్యూనికేషన్ కలిగి ఉండటం వంటివి మాత్రమే ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయని నిపుణులు చెప్తున్నారు.