తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలకు పెట్టింది పేరైన నటి ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి రెండో పెళ్ళి గురించి ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ నిర్మాతను ఆమె పెళ్లి చేసుకోబోతోందనే ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి వచ్చిన వార్తలపై నటి ప్రగతి వీడియో ద్వారా స్పందించారు.
‘ఒక ప్రముఖ మీడియా సంస్థ నుంచి ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇది బాధ్యత రాహిత్యమే అవుతుంది. నేను ఒక నటిని కాబట్టి మీరు ఏమైనా రాయవచ్చని అనుకోవడం తప్పు. ఒకరి వ్యక్తిగత జీవితంలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు రాయడానికి మీకేం హక్కు ఉంది. ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు? ఇదంతా ఎవరైనా కలగన్నారా? ఎవరి కలలోకైనా ఈ వార్త వచ్చిందా? నేను దీన్ని ఖండిస్తున్నాను. ఒకరి గురించి రాసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఆధారాలు ఉంటే రాయండి. అలాంటి విషయం ఏదైనా ఉంటే నేనే చెబుతాను కదా! ఇది చాలా చీప్. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. ఇక నుంచి అయినా బాధ్యతతో ఉండండి. ప్రొఫెషనల్ ఎథిక్స్, జర్నలిజం ఎథిక్స్ అనేవి ఉంటాయి కదా. ఇది అన్ ప్రొఫెషనల్, అన్ ఎథికల్, వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఇకపై ఇలా చేయకండి..’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు.