Thota Trimurthulu : శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు(Thota Trimurthulu) హైకోర్టు (AP High Court)షాక్ ఇచ్చింది. విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. 28 ఏళ్ల క్రితం దళిత యువకులకు శిరోముండనం(Dalit Tonsure Case) చేయించిన కేసులో తోట త్రిమూర్తులును దోషిగా తేలుస్తూ ఏప్రిల్ 16న విశాఖ కోర్టు (Visakha Court)సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఈ శిక్షను నెల రోజులు వాయిదా వేసి, ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విశాఖ కోర్టు తీర్పును త్రిమూర్తులు హైకోర్టులో సవాల్ చేశారు. జైలు శిక్షపై స్టే విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు…జైలు శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.
మండపేట అభ్యర్థిని మారుస్తారా?
తోట త్రిమూర్తులు మండపేట(Mandapeta) అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే అనూహ్యంగా 28 ఏళ్ల నాటి కేసులో కోర్టు జైలు శిక్ష విధించింది. రెండేళ్ల జైలు శిక్ష పడిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్ష పడింది. అయితే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో ఆయనపై అనర్హత కత్తిపై వేలాడుతుంది. పైగా జైలు శిక్షపై స్టేకు హైకోర్టు(AP Hight Court) నిరాకరించింది. దీంతో ఆయన నామినేషన్ దాఖలుపై సందిగ్దం నెలకొంది. నామినేషన్ కు మరో రెండ్రోజులే మిగలడంతో…వైసీపీ అభ్యర్థిని మారుస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ విషయంపై వైసీపీ అధిష్టానం చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దళిత డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తోట త్రిమూర్తులును(Thota Trimurthulu) కూడా కొనసాగిస్తే…దళితుల నుంచి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని మరింత వినియోగించుకునే అవకాశం ఉంటుందని, దీంతో మండపేటలో అభ్యర్థిని మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. తోట త్రిమూర్తులు స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్(Pilli Subhash Chandra Bose) కు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందని వైసీపీ సమాలోచనలు చేస్తుందని సమాచారం.
దళితులకు శిరోముండనం కేసు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు(Ysrcp Mlc Thota Trimurthulu) ఇటీవల విశాఖ న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. 1996 డిసెంబర్ 29న జరిగిన దళితులకు శిరోముండనం(Dalit Tonsure Case) కేసులో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో సహా 8 మందికి విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు జరిమానా, 18 నెలల జైలు శిక్ష విధించింది. 1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా తోట త్రిమూర్తులు గెలిచారు. గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారు. రాజకీయంగా తమకు ఎదురొస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి, శిరోముండనానికి పాల్పడ్డారు. 1996 డిసెంబర్ 29న కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2018 వరకు 148 సార్లు ఈ కేసు వాయిదా పడింది. ఆ తర్వాత నిరవధికంగా విచారణ కొనసాగింది. ఏప్రిల్ 16, 2024న విశాఖ ఎస్టీ, ఎస్టీ, అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.