ఒక దర్శకుడు ఒకే బ్యానర్ లో వరుసగా సినిమాలు చేయడం అరుదుగా జరుగుతుంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ గత కొన్నేళ్లుగా తన సినిమాలన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే చేస్తున్నాడు. ఇప్పుడు మరో దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా త్రివిక్రమ్ బాటలో పయనిస్తూ ఒకే బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు.
‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే కమ్ముల తను చేసే సినిమాలకు ఎక్కువగా తానే నిర్మాతగా వ్యవహరించారు. కానీ కొంతకాలంగా ఆయన రూట్ మార్చారు. బయట బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నారు. అందునా ఒకే బ్యానర్ లో వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు.
శేఖర్ కమ్ముల గత చిత్రం ‘లవ్ స్టోరీ’ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ధనుష్ హీరోగా కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర సినిమాసే నిర్మిస్తోంది. ఇది సెట్స్ పై ఉండగానే కమ్ములతో వరుసగా మూడో సినిమాని చేస్తున్నట్లు తాజాగా ఆ నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇలా ఒకే బ్యానర్ లో శేఖర్ కమ్ముల వరుస సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.