తెలుగు సినీ ప్రస్థానంలో వేణు వెల్దండి దర్శకుడిగా చేసిన ‘బలగం’ మూవీ ఓ చెరగని ముద్ర వేసుకుంది. ఇందులోని ప్రతీ పాత్ర మన ఇంట్లోని ఒకరిగా కన్పిస్తుంది. అంత సహజంగా తీర్చిదిద్దారు దర్శకుడు. ఇందులో లక్ష్మీ పాత్రలో చేసిన రూప లక్ష్మీ ప్రతీ ఒక్కరికి సుపరిచితమే. ఈ సినిమా తర్వాత తనకి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇక తాజాగా తను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దేవర(Devara) లో నటించినట్లు చెప్పుకొచ్చింది. ఇక అందులో తన అనుభవాలని షేర్ చేసుకుంది రూప లక్ష్మీ. తను మాడ్లాడుతూ.. నాకు ముందున్న సీనియర్ ఆర్టిస్టుల నుంచి నేను క్రమశిక్షణను నేర్చుకున్నాను. అలాగే నేను ఒప్పుకున్న పాత్రకి న్యాయం చేయడం కోసమే చివరివరకూ ప్రయత్నిస్తాను ” అని అంది. ‘దేవర’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేశాను. ఆ పాత్రకి నన్ను తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఆ విషయం నాకు ఎంతో ఆనందాన్నీ , ఆశ్చర్యాన్ని కలిగించిందని రూప లక్ష్మీ అంది.
ఆ తరువాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను. అప్పుడు ఆయన ‘బలగం’ సినిమా గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో చాలా బాగా చేశారంటూ నన్ను ప్రశంసించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఈ రోజున నేను ఈ స్థాయి వరకూ వెళ్లడానికి కారణం ‘బలగం’ సినిమానే. బలగం సినిమా నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అని రూప లక్ష్మీ అంది.