ఆర్గాన్ డొనేషన్ పై ఇప్పుడిప్పుడే దేశంలో అందరికీ అవగాహన కలుగుతోంది. చాలామంది అవయవ దానానికి ముందుకొస్తున్నారు. తమ మరణానంతరం అవయవదానం చేస్తామంటూ డిక్లరేషన్లు ఇస్తున్నారు. మరి వీళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన అవయవ దాత ఎవరు?
గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ శిశువు అత్యంత పిన్న వయస్కుడైన అవయవదాతగా నిలిచింది. ఈ శిశువు వయసు కేవలం 100 గంటలు మాత్రమే. పుట్టిన 24 గంటలకే శిశువులో చలనం లోపించింది. దీంతో న్యూరో సర్జన్ ను సంప్రదించారు. శిశువు బ్రెయిన్ డెడ్ కు గురైనట్టు వైద్యులు ప్రకటించారు.
సరిగ్గా అదే టైమ్ లో జీవన్ దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ రంగంలోకి దిగింది. శిశువు అవయవాల్ని దానం చేయాల్సిందిగా తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేసింది. వాళ్లకు వాటి అవసరాన్ని విడమర్చి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించారు.
వెంటనే శిశువు నుంచి కీలకమైన కిడ్నీలు, కళ్లు లాంటివి సేకరించారు వైద్యులు. వాటిని అప్పటికప్పుడు మరో నలుగురు శిశువులకు విజయవంతంగా అమర్చారు. అలా ఆ శిశువు బతికింది 100 గంటలే అయినప్పటికీ మరో నలుగురికి అవయవదానం చేసి చరిత్ర సృష్టించింది. మొన్నటివరకు ఈ రికార్డ్ 5 రోజుల చిన్నారి పేరిట ఉండేది.