‘గ్రహణం’, ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘సమ్మోహనం’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మోహన కృష్ణ ఇంద్రగంటి. అయితే ఆయన గత రెండు చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ‘వి’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై జస్ట్ ఓకే అనిపించుకోగా.. ఇక ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రమైతే పెద్దగా ప్రేక్షకులకు తెలియను కూడా లేదు. ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రగంటి.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి సిద్ధమవుతున్నారు.
ఇంద్రగంటి దర్శకత్వంలో ‘జటాయువు’ అనే భారీ సినిమా చేయబోతున్నట్లు గతంలో నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. కానీ ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపించడంలేదు. ఈ క్రమంలో ఇంద్రగంటి తన తదుపరి సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ లో ఆయనకిది మూడో సినిమా. గతంలో వచ్చిన రెండు సినిమాలు ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ దశలో ఉందని, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ‘బలగం’తో హీరోగా మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న ప్రియదర్శి.. ఇంద్రగంటితో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.