దిశ, ఫీచర్స్: ఇంపోస్టర్ సిండ్రోమ్ గురించి విన్నారా? మనం సాధించిన విజయాలు ఇతరుల ముందు చాలా తక్కువగా కనిపిస్తాయి. వారితో పోలిస్తే మనం వేస్ట్ అనిపిస్తుంది. మన సామర్థ్యంపై సందేహం కలుగుతుంది. ఎదుటివారు మెరుగ్గా కనిపిస్తారు. ఈ విషపూరిత ఆలోచన మనం అందుకునే సక్సెస్ ను ఖండిస్తుంది. ఆనందంగా ఉండకుండా చేస్తుంది. ఇందుకు అర్హులం కాదనే ఆలోచన వెంటాడుతుంది. మొత్తానికి ఎంత కష్టపడి విజయం సాధించినా.. పనికిరాని వారిమనే అనిపిస్తుంది. కాగా ఇలాంటి మానసిక పరిస్థితి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ LinkedIn వినియోగిస్తే కలుగుతుందని తాజా అధ్యయనం చెప్తుంది.
ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్ నెట్‌వర్కింగ్, కెరీర్ అవకాశాలను సులభతరం చేసింది. వృత్తిపరమైన ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చింది. బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. కెరీర్‌లో ఎదుగుదల, కనెక్షన్స్, పరిశ్రమకు సంబంధించిన నాలెడ్జ్ కోరుకునే విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ బెస్ట్ ప్లాట్‌ఫారమ్ గా మారింది. అయితే లేటెస్ట్ స్టడీ మాత్రం ఇది వినియోగదారులపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుందని చెప్పింది. ఇతరుల సక్సెస్ ఫుల్ కెరీర్స్ చూస్తున్న యూజర్స్.. తాము సాధించలేకపోతున్నామని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తో బాధపడేందుకు కారణం అవుతుంది. ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తుంది. అయితే ఈ లక్షణాలు తగ్గించుకునేందుకు తమలో కూడా నైపుణ్యం ఉందని, వృత్తిపరంగా మరింత ఎదుగుతామనే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే మానసికంగా మరింత ఎఫెక్ట్ అవుతారని హెచ్చరిస్తున్నారు.