ఉచితంగా ఇసుక పంపిణీ… ఉత్తుత్తిదే అని తేలిపోయింది. ఉచితం మాటున టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తూ, ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారు. ఈ వాతావరణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నాయకుడు తన అనుచరులను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారం ఇసుకను దోపిడీ చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి.
వేంపల్లె మండలంలోని అలిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని ఏటి నుంచి ప్రతి రోజూ పది టైర్ల లారీల్లో రాత్రివేళ ఇసుకను తరలిస్తున్నారు. ఇలా రోజుకు పది భారీ లారీల్లో ఇసుకను దోచేస్తుండడంపై ఆందోళన నెలకుంది. కనీసం రీచ్, ఇసుక స్టాక్‌యార్డ్ కూడా లేకుండానే, శ్యాండ్‌ను ఎలా తరలిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఒకవైపు చంద్రబాబునాయుడు ఇసుకను అక్రమంగా తరలించొద్దని, ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల ప్రమేయం వుండొద్దని హెచ్చరించడం తెలిసిందే. ఇవన్నీ ప్రచారానికే తప్ప, ముఖ్యంగా టీడీపీ నాయకులు ఇసుక దోపిడీ చేయకుండా అడ్డుకోలేకపోతున్నాయనే విమర్శ.
పులివెందుల నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా ఎవరూ అడ్డుకోలేరని, అనధికారికంగా చంద్రబాబు అనుమతి ఇచ్చారనే మాటలతో సదరు టీడీపీ నాయకుడు “టెక్” ప్రదర్శిస్తున్నారు.
అలిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోని ఏటి నుంచి ఇసుకను నంద్యాల, కర్నూలు, తిరుపతి జిల్లాలతో పాటు కర్నాటకకు కూడా తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ పులివెందుల నియోజకవర్గంలో ఆ నాయకుడి ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.