Special Sanitation Drive in Telangana : ఫిబ్రవరి 7 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైవ్(స్పెషల్ శానిటేషన్ డ్రైవ్) నిర్వహించాలని, ప్రజలను ముఖ్యంగా యువత, మహిళలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దంలా తయారు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చివరి రోజున గ్రామసభ నిర్వహించాలని, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించాలని సూచించారు. సర్పంచుల పదవీకాలం ముగియడం, గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలు కావడంతో గ్రామ పంచాయతీల పాలన అంశంపై ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లు శుభ్రం చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Source link