పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా, ఇమ్రాన్ హష్మి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ రేంజ్ కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఈ సినిమాకి ఉందని పవర్ స్టార్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అప్పటి హీరో వెంకట్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వెంకట్.. నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. కానీ హీరోగా సరైన బ్రేక్ రాకపోవడంతో.. ‘అన్నయ్య’, ‘భలేవాడివి బాసు’, ‘ఆనందం’, ‘శివరామరాజు’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించి సత్తా చాటాడు. అయితే కొన్నేళ్లుగా వెంకట్ సినిమాల్లో నటించడం తగ్గిపోయింది. ఒకటి అరా సినిమాల్లో కనిపిస్తున్నా అవి ఆయన కెరీర్ కి పెద్దగా ఉపయోగ పడటంలేదు. ఇలాంటి సమయంలో వెంకట్ కి ‘ఓజీ’ రూపంలో అదిరిపోయే అవకాశం లభించింది.
‘ఓజీ’ చిత్రంలో వెంకట్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే రివీల్ చేశాడు. ఈ సినిమా అత్యంత భారీస్థాయిలో రూపొందుతోందని, ఇప్పటికే తాను షూటింగ్ లో పాల్గొన్నానని వెంకట్ చెప్పాడు. ఈ సినిమా గురించి, తన పాత్ర ఇప్పుడే రివీల్ చేయలేనని.. కానీ ఈ మూవీ మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందని అన్నాడు. వెంకట్ మాటలను బట్టి చూసి.. ఓజీ మూవీ, అందులోని ఆయన పాత్ర అదిరిపోతాయని అర్థమవుతోంది.