అరుపులు…కేకలు లేవు…జుట్టు ఎగరేయడం లేనే లేదు. మనిషి అస్సలు ఊగిపోనే లేదు. మాటల్లో తూటాలు లేవు. జనానికి పట్టని కవిత్వం తప్ప. ఇదీ ఈ రోజు అవని గడ్డలో సాగిన పవన్ ప్రసంగం తీరు.
కానీ మారని వైనం కూడా వుంది. తెలుగుదేశంతో కలిసి వెళ్లడం తన అవసరం అన్నంతగా వివరణ. జగన్ ను ఎలాగైనా ఓడించాలి. మళ్లీ పదేళ్ల వరకు అధికారం ఇవ్వకూడదు.
పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తరువాత తేదేపా-జనసేన పొత్తు ప్రకటించారు.ఆ రోజు కాస్త గట్టిగానే మాట్లాడారు. ఆ తరువాత సైలంట్ అయిపోయారు.
ఏదో జరిగింది అని, భాజపా నుంచి కాస్త గట్టి సలహాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ఈ రోజు ప్రసంగంలో క్లారిటీ వస్తుందని అంతా చూసారు. నిజంగానే గట్టి సలహాలు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ప్రసంగంలో పవన్ ఓ మాట అన్నారు. మోడీకి చెప్పి, జగన్ ను కట్టడి చేయమని కోరవచ్చు. కానీ అలా కోరను. ఇది స్థానికంగా తమకు తమకు వున్న యుద్దం. తానే చేసుకుంటా. ఎవరి సహాయం అడగను అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అంటే జగన్ మీద పవన్ యుద్దానికి భాజపా సాయం లేదన్న క్లారిటీ వచ్చేసినట్లే.
సరే, ఈ సంగతి పక్కన పెడితే పవన్ స్పీచ్ లో కొన్ని ఆణిముత్యాలు దొర్లాయి ఎప్పటి లాగే.
తన తండ్రి తనను కనీసం డిగ్రీ పాస్ కమ్మని తరచు అడిగేవారని పవన్ చెప్పుకొచ్చారు.
తన తండ్రి కమ్యూనిస్ట్ అని, కొన్నాళ్లు అజ్ఙాతంలో వున్నారని కూడా ముక్తాయించారు. మరి అలా అజ్ఙాతంలోకి వెళ్లిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఎలా చేసారో?
ఎన్టీఆర్ టైమ్ లో సోషల్ మీడియా లేదని, ఆయనకు ఒంటరి పోరు సాగించి, అధికారం పొందడం సాధ్యమైందని, ఇప్పుడు అలా సాధ్యం కాదని చెప్పారు. అంటే ఎన్టీఆర్ టైమ్ లో పత్రికలు ఏది చెబితే అదే నిజం. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది వచ్చింది. మొత్తం వ్యవహారం అంతా బట్ట బయలు చేస్తోంది. అందువల్ల ఒంటరిపోరు కష్టం అని అనుకోవాలా?
తనకు సిఎమ్ పోస్ట్ అంటే మోజు లేదని, అయినా ఆ అవకాశం వస్తే తీసుకుంటా అని అన్నారు. మోజు వున్నా కూడా అవకాశం ఆమడ దూరంలో కూడా లేదు. ఆకాశం అంత దూరంలో వుంది. అందువల్ల తీసుకుంటా అంటే మాత్రం ఇచ్చేదెవరు?
మళ్లీ మరోసారి తనకు కుల పిచ్చి లేదంటూనే రకరకాల కులాల గురించి ఏకరవు పెట్టారు. అంతా అయిపోయింది..ముగించేస్తున్నారు. చంద్రబాబు గురించి చెప్పలేదిమిటా అని అనుకుంటే… ఆ క్షణమే ఆయనకు గుర్తు వచ్చినట్లుంది…సింపుల్…చంద్రబాబు తన నిజయతీ నిరూపించుకుని నీతి మంతుడిగా బయటకు వస్తారన్న ఆకాంక్షను వ్యక్తం చేసి సరిపెట్టారు.