తమ నాయకుడు, మంత్రి పవన్‌కల్యాణ్ చాలా తెలివైనోడని జనసేన కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఒక శాఖ నిధుల్ని, ఇతరత్రా అవసరాలకు మళ్లించకూడదని పవన్‌కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోక ముందు నుంచే చెప్పడాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పేరుతో ఒక శాఖ నిధుల్ని పాలకులు ఇష్టానురీతిలో మళ్లిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్రామీణాబివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్ నిధులకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో జగన్ సర్కార్ హయాంలో తన శాఖకు సంబంధించి నిధుల్ని ఇతరత్రా అవసరాలకు మళ్లించడంపై ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఇలా ఎలా మళ్లిస్తారంటూ అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. ఇదంతా పవన్ ఒక పథకం ప్రకారం చేస్తున్నారని జనసేన నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖకు కేంద్రం నుంచి నిధులు బాగా వస్తాయి. అలాగే తన పలుకుబడిని ఉపయోగించి మరింత ఎక్కువగా నిధుల్ని రాబడుతాననే నమ్మకం పవన్‌లో వుంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, ఇతరత్రా అవసరాల పేరుతో తన శాఖ నిధులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నేయకుండా, ముందుగానే నిధుల మళ్లింపుపై పరోక్షంగా హెచ్చరిక పంపినట్టు జనసేన శ్రేణులు చెబుతున్నాయి.
జగన్ సర్కార్ కంటే రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు ప్రస్తుత ప్రభుత్వానికి నిధుల అవసరం వుంది. తామిచ్చిన హామీల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలంటే అన్ని శాఖల నిధుల్ని వాడుకోవాల్సి వుంటుంది. చంద్రబాబు కేబినెట్‌లో మూడు పార్టీలకు ప్రాతినిథ్యం వుంది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ మంత్రుల శాఖలకు సంబంధించి నిధులు వాడుకోడానికి చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జనసేన, బీజేపీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రుల శాఖలకు సంబంధించిన నిధుల మళ్లింపు అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పవన్‌కల్యాణ్, నిధుల మళ్లింపుపై హెచ్చరించే ధోరణిలో మాట్లాడ్డం గమనార్హం. ఇది గత ప్రభుత్వానికి కాదని, సొంత సర్కార్‌కే అని జనసేన చెప్పడం విశేషం. ఎంతైనా రాజకీయాల్లో పవన్ రాటుతేలుతున్నాడు మరి!
The post పవన్ తెలివైనోడే! appeared first on Great Andhra.