పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు అందరికీ తెలిసినవాడే. చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి గుర్తింపు తెచ్చిన సినిమాలు ‘ఆ నలుగురు’, ‘జై చిరంజీవ’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో గుర్తింపు ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. అంతా సజావుగా సాగిపోతున్నా… ఒక్కోసారి విధి వక్రించి చేయని తప్పుకి తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సూర్య విషయంలోనూ అదే జరిగింది. ఆమధ్య జరిగిన దిశ ఘటనను ఆధారం చేసుకొని ‘కలియుగ’ అనే సినిమాను నిర్మించాలని రంగం సిద్ధం చేసుకున్నాడు. సినిమా కోసం అన్నీ అమ్ముకున్నాడు. ఆఖరికి ఇల్లు కూడా లేదు. సినిమా రిలీజ్ చెయ్యాలంటే మరో పాతిక లక్షలు కావాలి. డబ్బు కోసం సూర్య చేసిన ప్రయత్నాల్లో రాకేశ్‌రెడ్డి అనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తగిలాడు. అతని ద్వారా జయరాం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతన్ని కలిసిన మరుసటి రోజే హత్యకు గురయ్యాడు. పోలీసులు సూర్యను అరెస్ట్ చేశారు. అతనికి ఈ హత్యతో సంబంధం లేదని పోలీసులు అప్పుడే తేల్చేశారు. అయితే తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హత్యకేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని తెలియజేశాడు సూర్య.
‘‘ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించాను. ఇంకా ఏదో చెయ్యాలనే తపనతో ‘కలియుగ’ అనే సినిమా తీశాను. సినిమా పూర్తి చేయడానికి అన్నీ అమ్ముకున్నాను. సినిమా పూర్తయింది. రిలీజ్‌కి పాతిక లక్షలు కావాల్సి వచ్చింది. అప్పుడే రాకేశ్‌రెడ్డి జయరాంని పరిచయం చేశాడు. ఆయనకు నేనే ఫోన్ చేసి వెళ్ళి కలిసాను. ఆ మరుసటిరోజే జయరాం హత్యకు గురయ్యాడు. అంతకుముందు రోజు నేను ఆయన్ని కలవడం వల్ల పోలీసులు నన్ను అనుమానించారు. నన్ను ఎ5గా కేసు ఫైల్ చేశారు. అయితే ఆ తర్వాత ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. కానీ, మొదట నా పేరు వచ్చింది కాబట్టి మీడియా వాళ్ళు నన్ను ఎంత బ్యాడ్ చెయ్యాలో అంత బ్యాడ్ చేసేశారు. సినిమా రిలీజ్‌కి పాతిక లక్షల కోసం వెళ్ళి హత్య కేసులో ఇరుక్కున్నాను. ఈ కేసు వల్ల సినిమా రిలీజ్ కూడా డిలే అయిపోయింది. వచ్చే నెలలో ఓటీటీ ద్వారా ‘కలియుగ’ విడుదలవుతుంది’’ అన్నారు.