అసలే చేతిలో అధికారి. ఇక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నోటికి హద్దూ అదుపూ ఏముంటుంది? ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే, తమ కుటుంబ శత్రువు అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే… పంచె ఊడదీసి కొడ్తామని ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడం గమనార్హం. పెద్దారెడ్డిని ఖచ్చితంగా కొడ్తామని ఆయన తేల్చి చెప్పారు.
జేసీ, కేతిరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న సూర్యనారాయణరెడ్డి హత్యకు గురయ్యారు. హత్య వెనుక జేసీ కుటుంబం వుందని కేతిరెడ్డి కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. అందుకే ఇరు కుటుంబాలు పరస్పరం శత్రువులుగా చూసుకుంటున్నారు. గతంలో వైసీపీ హయాంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి దండయాత్రగా వెళ్లడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఇప్పుడు కూటమి అధికారంలో వుంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి స్థానంలో వున్నారు. అందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. ఇటీవల రవాణాశాఖ అధికారులపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన అదే రీతిలో మాట్లాడ్డం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యని ప్రతిబింబిస్తోంది. తాజాగా జేసీ మీడియా మాట్లాడుతూ వైసీపీలో తనకు నలుగురైదుగురు శత్రువులున్నారన్నారు. వాళ్లపై చట్టపరంగా వెళ్తానన్నారు.
తనకు ప్రాణహాని వుందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తానని గతంలో అన్నారని, ఆయన వల్ల ప్రాణహాని పొంచి వుందన్నారు. కేతిరెడ్డిని, ఆయన ఇద్దరు కుమారులను ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.