ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ, రాజకీయ కుట్రలకు, కుతంత్రాలను ఎత్తి చూపుతూ ప్రజల్ని మేల్కొలిపేలా రూపుదిద్దుకున్న చిత్రం ‘రాజధాని ఫైల్స్’. రాజధాని కోసం తమ భూముల్ని త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనను ఎంతో సహజంగా, అందర్నీ ఆలోచింపజేసేలా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ రూపొందిన తీరు సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పోస్టర్‌లోని ప్రతి అంశం అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కోసం ఎదురుచూసేలా చేసింది.
ఫిబ్రవరి 5న ‘రాజధాని ఫైల్స్’కి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుత సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల అన్నివర్గాల ప్రజలు ఎన్ని ఇక్కట్టు పడుతున్నారు, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు అనే విషయాన్ని సినిమాలో కూలంకషంగా చర్చించినట్టు ట్రైలర్‌లోనే అర్థమైపోతుంది. ‘కష్టపడమని చెప్తే.. ఎవడైనా మనల్ని ఇష్టపడతాడా? వాడికి సుఖాన్ని నేర్పి పడుకోబెట్టాలి’, ‘ప్రజలెప్పుడూ మన దగ్గర చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితుల్లో ఉండాలి’ అంటూ ప్రజల గురించి ఎంతో నీచంగా ఆలోచించే ముఖ్యమంత్రి, ‘140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని, 6 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి 4 రాజధానులా, ఇది రాజ్యాంగబద్ధమా, వ్యక్తిగత ద్వేషమా, ‘ఏడాది కాకపోతే.. నాలుగేళ్ళకైనా చదును చేస్తాం.. పంటలు పండిస్తాం.. రైతులంరా..’, ‘మనం ఒక పాదయాత్ర చేయబోతున్నాం.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. మహా పాదయాత్ర’ అంటూ ఆ ముఖ్యమంత్రిని ఎదిరించాలని, ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పి తమ హక్కుల్ని కాపాడుకోవాలని పోరాటం చేసే ప్రజలు.. ట్రైలర్‌లో సినిమాకి సంబంధించిన ఎంతో ఆసక్తికర అంశాలను చూపించి సినిమాపై ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పెరిగేలా చేశారు.
ఆలోచింప జేసే డైలాగులు, సన్నివేశాన్ని రక్తి కటించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేలా రూపొందించిన సన్నివేశాలు.. సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో సున్నితమైన అంశాన్ని కథగా తీసుకొని, దాన్ని ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసిన దర్శకుడు భాను ప్రతిభ గురించి సినిమా రిలీజ్ తర్వాత తప్పకుండా మాట్లాడుకుంటారు. ఎందుకంటే తను చెప్పాలనుకున్న విషయాన్ని ట్రైలర్‌లో చెబుతూనే దాన్ని ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించారు అనే క్యూరియాసిటీని ఆడియన్స్‌కు కలిగించడంలో దర్శకుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సినీ దిగ్గజాలు ఈ సినిమా కోసం పనిచేయడంతో ‘రాజధాని ఫైల్స్’ డెఫినెట్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. ఫిబ్రవరి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉంది.