ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరో డిమాండ్ తెర మీదికి వస్తోంది. ఇది కూడా కొత్తది కాదు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఏమిటా డిమాండ్? “ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు”. తాజాగా ఈ డిమాండ్ ను ఈ మధ్య కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెర మీదికి తెచ్చాడు. ఎస్సీలోని కులాలన్నీ ఒక్కటై ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేయాలన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏదైనా డిమాండ్ చేయొచ్చు.
వాస్తవానికి ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఓకే చెప్పినా ఈ అధ్యాయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇది కేవలం మాదిగలకు సంబంధించిన తీర్పుగా భావిస్తున్న మాలలు దీన్ని ఒప్పుకోవడంలేదు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామంటున్నారు. ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల జాతీయ నాయకులను కలిసి ఆందోళన చేస్తామంటున్నారు.
సరే …దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఇక ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయడం ఏ ప్రభుత్వం వల్ల కాదు. చాలా ఏళ్ళ కిందటే ఈ డిమాండ్ ను దేశంలోని పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు రంగంలోని దిగ్గజాలు వ్యతిరేకించారు. ఒకవేళ రిజర్వేషన్లు అమలు చేయాలని ఒత్తిడి చేస్తే తాము పరిశ్రమలను, కంపెనీలను మూసుకుంటామని, కానీ అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ప్రతిభ కొలమానంగా ఉద్యోగాలిచ్చే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉంటే ప్రతిభ లేనివారు, స్కిల్స్ లేనివారు వస్తారని భయం. రిజర్వేషన్లు అంటేనే ప్రతిభ లేనివారికి ఉద్యోగాలు ఇవ్వడమనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తే దేశంలోని యువత భగ్గుమంటారు. ఒకప్పటి మండల్ కమిషన్ మాదిరిగా మళ్ళీ నిప్పు రాజుకుంటుంది. దేశం అగ్ని గుండమవుతుంది.
అందులోనూ చట్ట సభల్లోని ప్రజాప్రతినిధుల్లో చాలామంది పారిశ్రామికవేత్తలున్నారు. వారు అంగీకరించకపోవొచ్చు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న కమ్యూనిస్టులు, సామాజికవేత్తలు చెబుతున్న కారణం ఏమిటంటే.. పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పడానికి ప్రభుత్వాలు స్థలాలు ఇస్తున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువకు ఇస్తున్నాయి. ఇక పన్నుల్లో అనేక రాయితీలు ఇస్తున్నాయి. కొన్ని రకాల పన్నులను కొన్నేళ్లపాటు వసూలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నాయి. ఇలా ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి బెనిఫిట్స్ చేస్తున్నాయి.
ప్రభుత్వాలు ప్రయోజనం కలిగిస్తున్నాయి కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ మీద ఇప్పటివరకు ప్రభుత్వాలు స్పందించలేదు. ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పన సాధ్యం కాదు కాబట్టి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించక తప్పదు. దేశీయంగా గానీ, విదేశాల నుంచిగానీ పెట్టుబడులు రావాలంటే పెట్టుబడిదారులు చెప్పిన షరతులకు, అడిగే పన్ను మినహాయింపులకు ప్రభుత్వాలు అంగీకరించక తప్పదు.
పెద్ద కంపెనీల పెట్టుబడుల కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి. ప్రైవేటు రంగం వారు ప్రభుత్వాలను రాయితీలు అడుగుతారుగానీ రిజర్వేషన్లను ఒప్పుకోరు. ఈ మధ్య కర్ణాటకలో జరిగిన గొడవ తెలిసిందే కదా. ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలను (కొన్ని రకాల) స్థానికులకే ఇవ్వాలన్న ప్రభుత్వం పెట్టిన షరతుకు ఐటీ కంపెనీల వారు పెద్ద యాగీ చేశారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు సాధ్యం కాకపోవచ్చు.