మేడమ్ టుస్సాడ్స్.. ఒకప్పుడు హాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే పరిమితమైన ఈ మైనపు మ్యూజియం, కొత్త బ్రాంచీలు ఏర్పాటు చేసిన తర్వాత సౌత్ ఏషియా ప్రముఖులకు కూడా వేదికైంది. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి ప్రముఖుల మైనపు విగ్రహాలు కొలువుదీరగా.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ మ్యూజియంలోకి ఎంటర్ కాబోతున్నాడు.
ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్ మైనపు ప్రతిమను దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు టుస్సాడ్స్ నిర్వహకులు, అధికారిక ప్రకటన విడుదల చేశారు.
"జాతీయ అవార్డ్ గ్రహీత, 69 ఏళ్ల చరిత్రలో ఈ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు, డాన్స్ మూమెంట్స్ కు ఐకాన్ అయిన అల్లు అర్జన్ ఈ ఏడాదిలోనే, దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఫేస్ టు ఫేస్ కలవబోతున్నారు." అంటూ పోస్ట్ పెట్టి, ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
బ్లాక్ సూట్ లో ప్రత్యేకంగా ముస్తాబైన అల్లు అర్జున్, టుస్సాడ్ నిర్వహకులకు తన కొలతలు ఇచ్చిన వీడియోను విడుదల చేశారు. అంతేకాదు, బన్నీ మైనపు విగ్రహానికి సంబంధించి కళ్లు, పెదవులు లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ను కూడా రిలీజ్ చేశారు. త్వరలోనే అల్లు అర్జున్ మైనపు విగ్రహం టుస్సాడ్స్ లో బన్నీ చేతుల మీదుగా ఆవిష్కృతం కానుంది.
ప్రస్తుతం పుష్ప-2 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.