టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఏ ముహూర్తాన వీరి కాంబినేషన్ సెట్ అయిందో కానీ.. ప్రతి సినిమాతో రికార్డుల మోతమోగిస్తున్నారు. ఇప్పటిదాకా వీరి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు రాగా.. మూడూ ఒక దానిని మించి ఒకటి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించాయి. అయితే ఈ మూడు సినిమాల్లో ‘లెజెండ్’ సినిమాకి ప్రత్యేక స్థానముంది. ఈరోజుల్లో థియేటర్లలో సినిమా రెండు మూడు వారాలు ఆడటమే గొప్ప అంటే.. తెలుగు సినీ చరిత్రలో మూడు సంవత్సరాలు ఏకధాటిగా ప్రదర్శించబడిన ఏకైక చిత్రంగా ‘లెజెండ్’ నిలిచింది. 2014 మార్చి 28న విడుదలైన ఈ సినిమా.. నేటితో పది వసంతాలు పూర్తి చేసుకుంది. పదేళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులను మరోసారి అలరించడం కోసం.. మార్చి 30న ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు.
తన కెరీర్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ.. 2004 లో వచ్చిన ‘లక్ష్మీనరసింహా’ తర్వాత ఐదేళ్ల పాటు వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. అలాంటి సమయంలో నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా వచ్చింది. అదే ‘సింహా’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. దాంతో నందమూరి ఫ్యాన్స్ బోయపాటిని అభిమానించడం ప్రారంభించారు. బాలయ్య-బోయపాటి కలయికలో రెండో సినిమాగా భారీ అంచనాలతో వచ్చిన చిత్రమే ‘లెజెండ్’. ‘సింహా’లో బాలకృష్ణను చూసే అభిమానులు పూనకాలతో ఊగిపోయారంటే.. అంతకు పదింతలు పూనకాలు తెప్పించేలా ‘లెజెండ్’లో చూపించారు బోయపాటి. బలమైన కథాకథనాలు, కట్టిపడేసే ఎమోషన్స్ తో ఈ చిత్రాన్ని మలిచారు. బాలయ్య రాయలిటీ లుక్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ కి అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇంతటి క్వాలిటీ అవుట్ పుట్ ని బోయపాటి కేవలం 90 రోజుల్లోనే తెరకెక్కించడం విశేషం.
ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చే పేరు బోయపాటి శ్రీను. కేవలం బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం బోయపాటి సినిమాలకు అభిమానులంటే అతిశయోక్తి కాదు. అందుకే ఎందరో హీరోలు, నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి పోటీ పడుతుంటారు. స్టైలిష్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ ఓ మంచి మాస్ సినిమా చేయాలి అనుకున్నప్పుడు.. ఆయనకు అల్లు అరవింద్ సూచించిన పేరు బోయపాటి శ్రీను. వీరి కాంబోలో వచ్చిన ‘సరైనోడు’ బాక్సాఫీస్ లెక్కలు సరిచేసింది. హీరోని మాస్ మూలాల్లోకి తీసుకెళ్లగలిగే సరైన డైరెక్టర్ బోయపాటి అని అల్లు అరవింద్ ఒక సందర్భంలో స్వయంగా చెప్పారు.
మరో నిర్మాత బెల్లంకొండ సురేష్ సైతం తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతో తపించారు. అలా వీరి కలయికలో వచ్చిన సినిమానే ‘జయ జానకి నాయక’. ఇది యూట్యూబ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇలా బోయపాటి కెరీర్ లో ఎన్నో మైలురాళ్ళు ఉన్నాయి. దర్శకుడిగా మొదటి సినిమాతోనే రవితేజకు ‘భద్ర’ లాంటి ఎవర్ గ్రీన్ మూవీ అందించారు. రెండో సినిమా ‘తులసి’లో వెంకటేష్ తో బోయపాటి పలికించిన హాస్యానికి, రౌద్రానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక చాక్లెట్ బాయ్ లాంటి రామ్ లో ఇంత మాస్ ఉందా అని షాక్ అయ్యేలా ‘స్కంద’లో చూపించారు. ఈ చిత్రంతో రామ్ తన మాస్ ఫాలోయింగ్ ని పెంచుకొని మరో మెట్టు ఎక్కాడు.
ఇలా బోయపాటి ఎన్ని సాధించినా ఆయన పేరు వింటే మొదటగా గుర్తుకొచ్చేది మాత్రం బాలయ్య పేరే. ఎందుకంటే వీరి కాంబినేషన్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అంతటి బలమైన ముద్ర వేసింది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకొని సంచలనాలు సృష్టించిన ఈ కాంబో.. త్వరలోనే నాలుగోసారి చేతులు కలపడానికి సిద్ధమవుతోంది.