‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతటి ఆసక్తి ఉంటుందో, ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఏర్పడతాయో తెలియంది కాదు. అయినా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా అంటే అది ఏ జోనర్‌లో ఉంటుంది, డైరెక్టర్ జోనర్‌లోనా, లేక హీరో ఇమేజ్‌కి తగిన జోనర్‌లోనా.. ఇలా రకరకాల ఊహాగానాల మధ్య, భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ విడుదలైన ‘భగవంత్ కేసరి’ అందరి అంచనాలను మించి ఘన విజయం సాధించింది. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్స్ బాలయ్యను దసరా విన్నర్‌ని చేశాయి.
మొదటి వారంలోనే రూ.112 కోట్లు కలెక్ట్ చేసిన ‘భగవంత్ కేసరి’ రెండో వారంలోనూ తన దూకుడుని కంటిన్యూ చేశాడు. పోటీగా రెండు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ వాటిని పక్కకు నెట్టి ముందుకు దూసుకుపోయాడు. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం, ‘భగవంత్ కేసరి’కి యునానిమస్ టాక్ రావడంతో కేవలం 10 రోజుల్లోనే రూ.123.92 కోట్ల గ్రాస్ అంటే దాదాపుగా రూ.124 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ‘భగవంత్ కేసరి’ ఉన్న ఊపు చూస్తుంటే త్వరలోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని అభిమానులు ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాలుగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలు రూ.130 కోట్ల వరకు కలెక్ట్ చెయ్యగలిగాయి. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’కి ఉన్న జోరు చూస్తుంటే ఈ రెండు సినిమాలను సునాయాసంగా క్రాస్ చేస్తుందనిపిస్తోంది.