దిశ, ఫీచర్స్: ఫంక్షన్ చిన్నది అయినా భారతీయ భోజనంలో చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ మొదలైన అనేక రకాల ప్రత్యేక వంటకాలు ఉన్నప్పటికీ, చివరిగా పెరుగు తిననిదే భోజనాన్ని ముగించరు. ఎన్ని ఆహారపదార్థాలు తిన్నా, పెరుగుతో తింటేనే ఆ అనుభూతి వేరుగా అనిపిస్తుంది. పెరుగు తినడం మంచిదే, కానీ మనం భోజనం ముగిశాక పెరుగు ఎందుకు తింటాము అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భారతీయ భోజనంలో పెరుగు ఎందుకు..?
జీర్ణక్రియ లాభాలు
పెరుగులోని ప్రీబయోటిక్ లక్షణాలు ప్రయోజనకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి మరియు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
చల్లదనాన్ని అందిస్తుంది
పెరుగుకు చలువ చేసే గుణాలు ఉంటాయి. వేడి చేసే ఆహారాలు తీసుకున్నప్పుడు కొంచమైనా పెరుగును తింటే.. శరీరం పై వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఘాటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే నాన్ వెజ్ తిన్న తర్వాత, చివరిలో కాస్త పెరుగు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పుష్కలమైన పోషకాలు
ఇందులో కాల్షియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అవి మంచి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. పెరుగు చర్మంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత
ఆహారంలో పెరుగు భారతీయ సంప్రదాయంలో లోతైన మూలాలను కలిగి ఉంది. అందుకే భారతీయ వంటకాల్లో పెరుగు తప్పనిసరి. ఇది సంప్రదాయమే కాదు, శాస్త్రీయంగా కూడా పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.