‘ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం, ఆయా రాష్ట్రాలలో ఆ వర్గాల ప్రజలలో ఉండే వెనుకబాటుతనాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు’ అంటూ ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పు 75 ఏళ్లు దాటిన స్వతంత్ర భారత సామాజిక చరిత్రలో ఒక గొప్ప మలుపు. ఈ తీర్పు నేరుగాను, పరోక్షంగానూ భారత సమాజంలో కులాల వారీగా జరిగే రిజర్వేషన్ల ఏర్పాటు ప్రశ్నిస్తుంది.
కులాల పేరుతో కొన్ని కుటుంబాలు మాత్రమే ప్రయోజనాలు పొందే దుర్మార్గపు పోకడని కూడా నిలదీసేలాగా ఈ తీర్పు ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగితే భారతీయ సామాజిక ముఖచిత్రం పూర్తిస్థాయిలో మారిపోతుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ అనేది చాలా పురాతనమైన సమస్య. ఎస్సీలలో కూడా వర్గీకరణ జరిగి తీరాలని మాలలకు, మాదిగలకు విడివిడిగా రిజర్వేషన్ కోటాలు ఉండాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. ఎస్సీలకు అందుతున్న రిజర్వేషన్ ప్రయోజనాలు అన్నింటిని మాలలు మాత్రమే దక్కించుకుంటున్నారని, మాదిగలకు అన్యాయం జరుగుతుందని దశాబ్దాల పోరాటం నడుస్తోంది. మధ్యలో చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించారు గాని అది ఆ తర్వాత కోర్టులో చెల్లకుండా పోయింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి ఎస్సీ కులాల వర్గీకరణ జరిగే అవకాశం ఉంది.
నిజానికి ఇది కేవలం ఎస్సీలలో ఉండే మాలలకు- మాదిగలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఎస్టీలలో కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఏ విధంగా అయితే ఎస్సీ రిజర్వేషన్లను మాలలు ఎక్కువగా వాడుకోగలుగుతున్నారు మాదిగలకు అన్యాయం జరుగుతోంది అనే అందరికీ తెలిసిన వాదన.
కాగా ఎస్టీలలో లంబాడీలు మాత్రమే అధిక ప్రయోజనాలు పొందుతుంటారని గొండులు ఆదివాసీలు ఆ తరహా అనేక వర్గాలకు అన్యాయం జరుగుతూ వస్తున్నదని చాలాకాలంగా పోరాటాల నడుస్తున్నాయి. అలాంటి వెనుకబడిన చిన్న ఉప కులాల వారికి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగే అవకాశం ఉంది. తద్వారా భారత సామాజిక ముఖచిత్రం తప్పకుండా మారుతుంది.
తరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎన్నడూ రిజర్వేషన్ సదుపాయం అనేది ఎరగకుండా కేవలం వెనుకబాటు తనంలోనే మగ్గిపోతూ వస్తున్న కొన్ని చిన్న చిన్న కులాలు కూడా ఇప్పుడు కాస్త మెరుగైన జీవన ప్రమాణాలను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తీర్పు పట్ల దేశంలో కొన్ని వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.