మంచి కసితో అజయ్ భూపతి చేస్తున్న సినిమా మంగళవారం. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని, డిఫరెంట్ స్టోరీలైన్ ను సెలక్ట్ చేసుకున్నాడు. తన కథకు మంచి సెటప్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. అదే 'మంగళవారం' సినిమా. ఈసారి అజయ్ భూపతి చాలా కొత్తగా ప్రయత్నిస్తున్నాడనే విషయం, మంగళవారం టీజర్ చూస్తే ఎవరికైనా అర్థమౌతుంది.
ఆ టీజర్ వచ్చినప్పట్నుంచి సినిమాపై అందరి దృష్టి పడింది. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ లాక్ చేశాడు అజయ్ భూపతి. నవంబర్ 17న మంగళవారం సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపాడు. తన సినిమా ప్రచారానికి మంగళవారాన్ని వాడుకున్న ఈ దర్శకుడు, సినిమాను మాత్రం అందర్లానే శుక్రవారమే రిలీజ్ చేస్తున్నాడు.
మహాసముద్రంతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు, మంగళవారంతో ప్రేక్షకులకు థ్రిల్ అందించాలని ఫిక్స్ అయ్యాడు. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో శ్రీతేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమాలో పాత్రలన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఎవరు మంచోడు, ఎవరు చెడ్డవ్యక్తి అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరంటున్నారు దర్శకుడు. పూర్తిగా క్యారెక్టర్స్, స్క్రీన్ ప్లే బేస్ చేసుకొని రాసుకున్న ఈ కథలో చాలామంది కొత్తవాళ్లు నటించారు.
99 రోజుల పాటు మంగళవారం సినిమాను షూట్ చేస్తే, అందులో 51 రోజులు నైట్ షిఫ్టులు చేశారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లోనే అతడు తన టాలెంట్ ఏంటో చూపించాడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా అజయ్ భూపతి కెరీర్ కి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి