చంద్రబాబు సర్కార్ కొలువుదీరిన తర్వాత చకచకా మార్పులు జరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న అధికారుల్ని సమూలంగా మార్చేశారు. వీరిలో కొంత మందికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. మరికొందరికి అప్రాధాన్య పోస్టులు ఇచ్చారు. అలాగే పరిపాలన విధానాల్ని మార్చడంలో వేగం అందుకుంటోంది. కొన్ని విషయాల్లో మాత్రం జగన్ పాలనా విధానాల్నే కొనసాగిస్తున్నారనే చర్చకు తెరలేచింది.
ఉదాహరణకు ఉద్యోగులకి సంబంధించి జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీపీఎస్. దీనిపై కూటమి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే జీవో ఇచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. రద్దు మాత్రం చేయకపోవడం గమనార్హం. ఇసుక పాలసీ విధానం చూస్తే …పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా వుంది.
ఉచిత ఇసుక అందుకుంటున్న వాళ్ల భాగ్యం అనుకోవాలి. ఎక్కడ ఇస్తున్నారో, ఏమి ఇస్తున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. మరో ప్రధానమైన పాలసీ… మద్యం విక్రయం. జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టడానికి ఇది కీలకమైంది. ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది. అది కూడా మందుబాబులు కోరుకున్న బ్రాండ్లు కాకుండా, ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినవే తాగాలనే రీతిలో అనధికార , నిర్బంధ షరతు.
ఎక్సైజ్ అధికారుల సమాచారం ప్రకారం… మరో ఏడాది పాటు ప్రభుత్వమే మద్యం విక్రయించేలా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రభుత్వ పెద్దలు సూచించిన బ్రాండ్లనే అమ్ముతారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం తెలిసి కూడా, బాబు సర్కార్ అదే పని చేయడానికి సాహసిస్తుందా? అనేది ప్రశ్న. త్వరలో ప్రభుత్వం మద్యం విక్రయాల్ని ప్రైవేట్ పరం చేస్తుందని, వాటికి టెండర్లు వేయడానికి టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నారు.
మరోవైపు కల్లు గీత కార్మికులకు పది శాతం మద్యం దుకాణాల్ని కేటాయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలపై టీడీపీ వ్యాపారస్తుల కన్ను పడింది. కానీ ప్రభుత్వమే మరో ఏడాది అమ్మకాలు చేపట్టాలనే చర్చ నేపథ్యంలో నాయకులు అసహనంగా ఉన్నారు.