ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) టైం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగునాట ‘కల్కి’ పేరు మారుమోగిపోతోంది. భారీ అంచనాలతో మరికొద్ది గంటల్లో (జూన్ 27న) విడుదలవుతున్న ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. దానికి తగ్గట్టుగానే కల్కి సినిమాకి అన్నీ కలిసొస్తున్నాయి.
‘కల్కి’ టీంకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి రోజు ఆరో షో వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో ఉదయం 4:30 నుంచి 8 గంటల మధ్య స్పెషల్ షో వేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే జూన్ 27 నుంచి రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి, ఐదు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చిన ఏపీ సర్కార్.. ఇప్పుడు మొదటి రోజు ఆరో షో వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ‘కల్కి’ చిత్రానికి మొదటి ఎనిమిది రోజులు టికెట్ ధరలు పెంచుకోవడానికి, ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఫస్ట్ డే ఆరు షోలకు ఓకే చెప్పింది.
మొత్తానికి తెలుగునాట ఈ వెసులుబాటుతో.. ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ‘కల్కి’ సంచలనాలు సృష్టించే అవకాశముంది.