మిర్యాలగూడలో పొత్తుల చిచ్చు
ఈ ఎన్నికల్లో సీపీఎం రాష్ట్రంలో తమకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రచాలం, పాలేరు స్థానాలను ఆశించింది. కానీ తమ పార్టీకి ఉన్న పరిమితుల రీత్యా మిర్యాలగూడ స్థానంతో పాటు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు చెబుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ అటు సీపీఐ, ఇటు సీపీఎంలకు ఇవ్వనున్న స్థానాల విషయంలో లీకు వార్తాలే కానీ, అధికారిక ఇంకా ప్రకటించనే లేదు. అయినా ఏఐసీసీ నాయకత్వం ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో మిర్యాలగూడకు స్థానం దక్కలేదు. దీంతో ఈ సీటును ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఎంకే కేటాయిస్తున్నారన్న అభిప్రాయం బలపడింది. ఈ కారణంగానే కాంగ్రెస్ శ్రేణులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నారు.