డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ అంటే విభిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అతను చేసిన ప్రతి సినిమా విభిన్నంగా ఉండడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాన్ని కూడా ఇస్తాడు. అజిత్ హీరోగా తమిళ్‌లో వచ్చిన ‘దిన’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన మురుగదాస్ ఆ తర్వాత టాప్ హీరోలతో సెన్సేషనల్ హిట్స్ తీశాడు. రజనీకాంత్‌తో చేసిన ‘దర్బార్’ అతని చివరి సినిమా. ఈ సినిమా రిలీజ్ అయి మూడు సంవత్సరాలవుతోంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ అతని కొత్త సినిమా ఎనౌన్స్‌మెంట్ రాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు మురుగదాస్.
కోలీవుడ్ పాపులర్ హీరోలలో శివకార్తికేయన్ ఒకరు. ఇప్పుడు మురుగదాస్ చేయబోయే సినిమాలో హీరో శివకార్తికేయన్. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించే ఈ భారీ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నాడు మురగదాస్. సెప్టెంబర్ 25 మురుగదాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. త్వరలోనే ఈ భారీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇది శివకార్తికేయన్ చేస్తున్న 23వ సినిమా అవడం విశేషం.