వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సంగతేమో కానీ.. వీళ్ల ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా కాంపౌండ్ నుంచి రిలీజ్ అవుతున్న ఒక్కో ఫొటో, ఒక్కో స్పెక్యులేషన్ కు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య ఉన్న సంబంధంపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి ఈ ఫొటోలు.
మొన్నటికిమొన్న చిరంజీవి తన ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చారు. కాబోయే భార్యాభర్తల్ని తన ఇంటికి ఆహ్వానించి, మెగా సభ్యులందరితో భారీ గెట్ టు గెదర్ ఏర్పాటుచేశారు. కొణెదల అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ దీనికి హాజరయ్యారు. ఇద్దరు తప్ప. వాళ్లే పవన్ కల్యాణ్, అల్లు అర్జున్.
పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో, మరోవైపు సినిమాలతో బిజీ. కాబట్టి రాలేదు అనుకోవచ్చు. కానీ ఊళ్లోనే ఉండి, తీరిక చేసుకునే వెసులుబాటు ఉండి కూడా బన్నీ ఈ సెలబ్రేషన్ కు హాజరుకాలేదు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు, ఫ్రేములో కనిపించలేదనేది మాత్రం వాస్తవం.
కట్ చేస్తే, ఈసారి స్వయంగా బన్నీ దంపతులు పార్టీ ఇచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని తమ ఇంటికి ఆహ్వానించారు. మెగా సభ్యులతో పాటు, నితిన్, రీతూవర్మ లాంటి క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. కానీ ఈ సెలబ్రేషన్ లో చరణ్ కనిపించ లేదు. దీంతో 'మెగానుమానాలు' ఎక్కువయ్యాయి.
రామ్ చరణ్, అల్లు అర్జున్ కు ఈమధ్య పెద్దగా పొసగడం లేదనే టాక్ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ వేసిన ట్వీట్.. దానికి రిటార్ట్ గా నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు చరణ్ వేసిన ట్వీట్ చూస్తుంటే.. ఇద్దరి మధ్య ఏదో రగడ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడా అనుమానాలకు మరింత ఊతమిస్తూ, అతడి ఫంక్షన్ లో ఇతడు, ఇతని ఫొటోల్లో అతడు మిస్ అవ్వడం కనిపించింది.