విశాఖలో రుషికొండ ప్యాలెస్ ని ప్రజా ధనంతో జగన్ కట్టారని టీడీపీ విమర్శిస్తోంది. ఇది గత విమర్శలకు భిన్నమైన వాదనగానే చూడొచ్చు. నిన్నటిదాకా జగన్ ప్రభుత్వం సొమ్ముతో సొంత ప్యాలెస్ ని కట్టుకున్నారు అని ప్రచారం చేశారు. అయితే అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం సొమ్ముతో కట్టినది అని వైసీపీ వాదించింది. ఈ ప్రభుత్వం దానిని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ సలహా ఇచ్చారు.
అసెంబ్లీలో ఆర్ధిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు ఆర్ధిక విధ్వంసంలో ఇది చాలా పెద్దది అని రుషికొండ ప్యాలెస్ ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అయిదు వందల కోట్లు ఖర్చు చేసి జగన్ తన విలాసాలకు వేదికగా మార్చుకున్నారు అని అన్నారు.
ఆయన రుషికొండ భవనం మీద కూర్చుని బీచ్ ని చూస్తూ ఉల్లాసంగా గడపాలని అనుకున్నారు అని సెటైర్లు వేశారు. విశాఖ రాజధాని చేయాలని కాదు జగన్ విలాసం కోసమే ఇదంతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రుషికొండ భవనాన్ని ఏమి చేయాలో అర్థం కావడం లేదు అని బాబు అన్నారు. అదే మొత్తం వెచ్చిస్తే పర్యాటక శాఖకు వేల కోట్లు ఆదాయం వచ్చేది అని కూడా చంద్రబాబు అన్నారు. అయితే రుషికొండ ప్యాలెస్ ని కూడా టేకోవర్ చేయడానికి చాలా సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
వారికి లీజుకి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పెంచుకోవచ్చు. అంతే కాదు పర్యాటక శాఖ రుషికొండ ప్యాలెస్ చూడడానికి టికెట్లు పెట్టి జనాలను ఆహ్వానిస్తే ఆదాయం వస్తుందని కూడా సూచనలు ఉన్నాయి. ఆయన ఎందుకు కట్టారో కానీ వినియోగించుకోవడం ప్రభుత్వం చేతిలో ఉంది కదా.
అది అద్భుత కట్టడం అని కూడా కొనియాడే వారూ ఉన్నారు. పాజిటివ్ గా తీసుకుని ప్రభుత్వం దాని వినియోగం మీద దృష్టి పెట్టాలని అంటున్నారు. జగన్ ఏమీ కట్టలేదు అని ఒక వైపు అంటూ మరో వైపు కట్టిన వాటిని సైతం విధ్వంసం అంటున్నారు అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏది కట్టినా అది ఆస్తిగానే ఉంటుంది. దిట్టంగా కట్టిన రుషికొండ కట్టడాన్ని చక్కగా ఉపయోగించుకోవడం పైన ఆలోచించాలి కానీ దానిని పెద్ద ప్రశ్నగా మిగల్చకూడదని అంటున్నారు. రుషికొండను చూపించి రాజకీయ విమర్శలు చేస్తూ పోతే పర్యాటక శాఖకు ఆదాయం కూడా రాదు అని అంటున్నారు.