దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని అద్భుతాలను నమ్మడం కూడా కష్టమే. అలాగే అక్కడక్కడ అవిభక్త కవలలు జన్మిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు వింతగా పుడతారు. అంటే కొందరు మూడు లేదా నాలుగు కాళ్ళతో పుడతారు. మరికొందరు రెండు తలలు, ఒక మొండెం తో పుడతారు, అలాగే తలలు అతుక్కుని, శరీరం అంతా అతుక్కుని పుడుతుంటారు. ఇలాంటి కొన్ని సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. అయితే రెండు తలలు, ఒక మొండెం తో పుట్టిన పిల్లలు ఎక్కువ కాలం జీవించరని వైద్యులు చెబుతున్నప్పటికీ చాలా మంది పిల్లలు బతికే ఉంటారు. అలాంటి ఇద్దరు కవల సోదరీమణుల కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఇద్దరు సోదరీమణుల పేర్లు అబీ, బ్రిటనీ హాన్సెల్. ఈ ఇద్దరి తలలు రెండుగా ఉన్నప్పటికీ మొండెం మాత్రం ఒకటిగానే ఉంది. న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం ఇద్దరు సోదరీమణులు 1996లో ఓప్రా విన్‌ఫ్రే షోలో కనిపించినప్పుడు మొదట వెలుగులోకి వచ్చారు. ఆ సమయంలో వారిపై ఒక ప్రత్యేకమైన టీవీ షోను కూడా రూపొందించారు. అందులో వారు తన జీవితాన్ని సాధారణ వ్యక్తులలా ఎలా గడుపుతున్నారో చెబుతూ చాలా సంతోషంగా ఉన్నారు.
అయితే ఇద్దరు సోదరీమణుల వయస్సు ప్రస్తుతం (34) సంవత్సరాలు కాగా వారు కూడా వివాహం చేసుకున్నారు. వారి వివాహం జరిగి కూడా మూడు సంవత్సరాలు అయ్యింది. అయితే ఈ విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఈ అవిభక్తకవల సోదరీమణులు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అతని పేరు జోష్ బౌలింగ్. జోష్ గతంలో US ఆర్మీలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్నారు. జోష్ తన ఇద్దరు భార్యలు, అబీ , బ్రిటనీతో మిన్నెసోటాలో నివసిస్తున్నాడు.
తాను అబీ, బ్రిటనీతో కలిసి తరచూ బయటకు వెళ్తుంటానని, వారికి ఐస్ క్రీం అంటే ఇష్టం కాబట్టి వారికి ఐస్ క్రీం కూడా తినిపిస్తానని జోష్ ఓ ఇంటర్వూలో తెలిపారు. అబీ, బ్రిటనీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ప్రపంచంతో పంచుకోకపోయినా, జోష్‌గా ఏమీ చెప్పకపోయినా, ముగ్గురూ తమ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తుంది.