టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి రాజ‌కీయంగా ప్ర‌యోజనం క‌లిగించేందుకేనా హైద‌రాబాద్‌లో టీడీపీ చంద్ర‌బాబు అరెస్ట్ పేరుతో అల్ల‌రి చేస్తోంద‌నే అనుమానాన్ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్‌పై అభ్యంత‌రం వుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర‌స‌న ప్ర‌క‌టించొచ్చు. కానీ హైద‌రాబాద్‌లో ప‌దేప‌దే నిర‌స‌న‌ల పేరుతో టీడీపీ ఎందుకు పిలుపునిస్తోంద‌నే ప్ర‌శ్న ఉత్పన్న‌మైంది.
చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగులు లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్ పేరుతో పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా మెట్రోలో ప్ర‌యాణించే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని పోలీసులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని టీడీపీ అనుకూల ఐటీ ఉద్యోగులు త‌ప్పు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. కేసీఆర్ ప్ర‌భుత్వంపై నిర‌స‌న‌కారులు శాప‌నార్థాలు పెట్ట‌డం వెనుక టీడీపీ రాజ‌కీయ ఎత్తుగ‌డ వేరే ఉంద‌ని అంటున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 30న ఒకేసారి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ఈ ఎన్నిక‌ల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గ ఓట్లు ఎవ‌రిక‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రెడ్ల‌కు 40 సీట్లు ఇవ్వ‌డం, అలాగే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌ల‌కు స్నేహ సంబంధాలు ఉండ‌డంతో క‌మ్మ సామాజిక వ‌ర్గం బీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా వుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.
చంద్ర‌బాబు ప్రియ శిష్యుడిగా పేరొందిన రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం, ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తే రేవంత్‌రెడ్డి సీఎం అవుతార‌ని టీడీపీ న‌మ్ముతోంది. అప్పుడు త‌మ‌కు ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని క‌మ్మ సామాజిక వ‌ర్గం విశ్వ‌సిస్తోంది. దీంతో తెలంగాణ‌లో బీఆర్ఎస్‌, బీజేపీల‌కు టీడీపీ వ్య‌తిరేక‌మ‌నే సంకేతాల్ని పంపేందుకే చంద్ర‌బాబు అరెస్ట్‌కు నిర‌స‌న‌గా హైద‌రాబాద్‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.
చంద్ర‌బాబుకు సంఘీభావం పేరుతో రేవంత్‌రెడ్డికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డానికే టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ ఆడుతోంద‌న్న అనుమానం బీజేపీ, బీఆర్ఎస్‌ల‌లో ఉంది. అందుకే టీడీపీ కార్య‌క‌లాపాల‌ను ఆ రెండు పార్టీలు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నాయి. ఎన్నిక‌ల వేళ‌లో క‌మ్మ సామాజిక వ‌ర్గం వ‌ల్ల లాభం కంటే న‌ష్ట‌పోకుండా వుండేందుకే ప్ర‌ధానంగా బీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా న‌డుచుకుంటోంది.