ఈమధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు పెళ్లిళ్లు చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. సంసార జీవితంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోపక్క ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో గెలిచిన వారు, ముఖ్యమంత్రి, మంత్రులు అయినవారు రాజకీయంగా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక కొందరు రాబోయే ఎన్నికలపైనే ఆశలు పెట్టుకున్నవారు, ఎలాగైనా గెలిచి గద్దెనెక్కాలని ఉబలాటపడుతున్నవారు ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వారెవ్వరూ ఆనందంగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం ఒక వ్యక్తికి ఇష్టం లేదు. ఏదో విధంగా వారిని మానసికంగా వేధించాలి, మనశ్శాంతి లేకుండా చేయాలి. అదే అతని ధ్యేయం. దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎలాంటి విషయాన్నయినా బహిరంగంగా ప్రకటిస్తాడు. అతనే వేణుస్వామి. తనని తాను గొప్పవాడిగా ప్రకటించుకోవడమే కాకుండా ప్రపంచంలోని మనుషులందరి భవిష్యత్తు తనకే తెలుసు అనే బిల్డప్ ఇస్తూ మీడియాలో విపరీతమైన ప్రచారం పొందుతూ ఉంటాడు. అతని టార్గెట్ సినిమాలు, రాజకీయం. ఈ రెండు రంగాలకు చెందిన వ్యక్తులనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాడు. సినిమా రంగంలో అయితే ఏ జంట విడాకులు తీసుకోబోతోంది అనేది ముందే చెబుతాడు. యాధృశ్చికంగానే అది నిజమైతే వేణుస్వామి చెప్పింది అక్షరాలా జరిగింది అని అందరూ చెప్పుకోవాలనేది అతని ఆశ. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. ఇక్కడ విడాకుల ప్రస్తావన ఉండదు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే మాటలే చెబుతాడు. ఒక రాజకీయ నాయకుడు విడాకులు తీసుకుంటాడు అని చెబితే కిక్కేముంటుంది. అదే ఒక హీరో, హీరోయిన్ పెళ్ళి చేసుకుంటే వారు విడాకులు తీసుకుంటారు అని చెబితేనే కదా జనం నోళ్ళలో వేణుస్వామి పేరు నానేది.
తాజాగా మరో ప్రేమ జంటను టార్గెట్ చేశాడు వేణుస్వామి. కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ ఇటీవల పెద్దల అంగీకారంతో ఎంతో వైభవంగా పెళ్ళి చేసుకున్నారు హీరో వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. చక్కని జంటగా అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న వీరు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానులను కూడా ఖుష్ చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి ఈ జంట విడాకుల కథను మొదలుపెట్టాడు. వరుణ్, లావణ్య జాతకాల్లో దోషం ఉందని, ఎక్కువ కాలం వీరిద్దరూ కలిసి ఉండలేరని వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లి జరిగి ఆరు నెలల కూడా అవ్వక ముందే వారు విడాకులు తీసుకుంటారంటూ నస మొదలుపెట్టాడు. ఒక స్త్రీ వల్ల వారిద్దరూ విడిపోతారని జోస్యం చెప్తున్నాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరి జీవితంలోనైనా జరిగే మంచి గురించి చెప్పాలి, అంతే తప్ప ఇలాంటి విషయాల గురించి పబ్లిక్‌గా మాట్లాడడం అనేది సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పెళ్లి మూడ్ నుంచి ఇంకా బయటికి రాని జంట గురించి అర్జెంట్‌గా ఇలాంటి కామెంట్స్ చేయడం శాడిజం అనిపించుకుంటుందని మరికొందరు వేణుస్వామిని విమర్శిస్తున్నారు.