posted on Jul 15, 2024 9:30AM
వర్షపు రోజులలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. ఈ వాతావరణం అనేక రకాల వైరస్‌లు, బాక్టీరియాల పెరుగుదలకు అత్యంత అనుకూలమైనవి. ఈ సీజన్‌లో అంటు వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అంటు వ్యాధులను నివారించడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లు పెంపొందించుకోవడం ఎంతో అవసరం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ. అయితే ప్రతిరోజూ ఈ రోగనిరోధక శక్తిని పెంపొందించడం అనేది ఉదయంతో ప్రారంభం కావాలి. దీంతో రోజు మొత్తం ఒక క్రమంలో పటిష్టమవుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ వర్షాకాలంలో వచ్చే తీవ్రమైన అంటువ్యాధులను అరికట్టడానికి ప్రతిరోజూ ఉదయం ఒకే ఒక్క పని చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేవలం సాధారణ వైద్యులే కాదు.. ఆయుర్వేద నిపుణులు కూడా ఉదయాన్నే చేసే ఈ పనిని సమర్థిస్తున్నారు.
ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగమని అల్లోపతి నుండి ఆయుర్వేదం వరకు అన్నిరకాల వైద్యులు చెబుతున్న మార్గం. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఉదయాన్నే వేడినీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే..
వర్షాకాలంలో ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా సాధారణంగా వచ్చే సమస్య. పరిస్థితులలో ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. బరువు తగ్గడానికి అలాగే సాధారణ దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి గోరువెచ్చని నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుందని అన్ని వైద్యాలలో చెప్పబడింది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో గోరువెచ్చని నీటిని తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడింది. గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడం చాలా సులువుగా ఉంటుంది.
ముక్కులు మూసుకు పోతే..
ఫ్లూ ఇన్‌ఫెక్షన్‌లో ముక్కు మూసుకుపోవడం అనే సమస్య అధికంగా ఉంటుంది. నిజానికి మొదట ముక్కులు మూసుకుపోవడంతోనే ఈ సమస్య మొదలవుతుంది. దీనికి నివారణ కావాలంటే గోరువెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వేడి నీటిని తాగడంతోపాటు తేలికపాటి ఆవిరిలో లోతైన శ్వాస తీసుకోవడం కూడా మంచిది. ఇది సైనస్ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. ముక్కు లోపలి గోడలకు ఓదార్పు లభిస్తుంది. వేడి పానీయాలు ముక్కు కారటం, దగ్గు, గొంతు నొప్పి, అలసట నుండి త్వరగా, శాశ్వత ఉపశమనాన్ని అందిస్తాయి.
జీర్ణక్రియలో సహాయపడుతుంది..
వర్షాకాలంలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది. కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, వాతావరణంలోని తేమ కారణంగా శ్వాస సమస్యలు, జీర్ణసంబంధ సమస్యలు కూడా వస్తాయి. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీరు కడుపు, ప్రేగులలో కదులుతున్నప్పుడు, శరీర వ్యర్థాలను చాలా సులువుగా బయటకు పంపుతుంది. వేడి నీటిని తాగడం జీర్ణవ్యవస్థను సక్రియం చేయడంలో, జీవక్రియను మెరుగ్గా ఉంచడంలో ఒక భాగం. అంతే కాదు కడుపు నొప్పి, కడుపు తిమ్మిరి, కడుపులో వికారం వంటి ఇతర సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.
కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగుతూ ఉంటే వర్షాకాలంలో ఎదురయ్యే ప్లూ, జలుబు, దగ్గు, శ్వాస సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*నిశ్శబ్ద.