posted on Jan 13, 2024 9:28AM
నువ్వులు భారతీయుల ఆహారంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆయుర్వేదం కూడా నువ్వులను గొప్ప ఆహారంగా పేర్కొంది. నువ్వులలో ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటివన్నీ ఉంటాయి. చలికాలంలో రోజూ కాసిన్ని నువ్వులను తింటే శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నువ్వులను రోజూ తినడం వల్ల కలిగే ఇతర ఆరోగ్యప్రయోజనాలు ఏంటో తెలిస్తే నువ్వులను అస్సలు వదలకుండా తింటారు.
ఆయుర్వేదం ప్రకారం నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. నువ్వులను తీసుకుంటే శరీరంలో వేడి పుడుతుంది. ఇది జఠరాగ్నిని సమతుల్యం చేస్తుంది. సాధారణంగా జఠరాగ్ని లోపించడం వల్ల జీర్ణశక్తి మందగించి జీర్ణక్రియ తగ్గుతుంది. దీనికారణంగా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. అదే నువ్వులు తింటే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
నువ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో ఉన్న చెడు కొవ్వులను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శరీరంలో కండరాలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. నువ్వులలో ఉండే ప్రోటీన్ కండరాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. నువ్వులలో ఉండే మాక్రోన్యూట్రియెంట్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మాన్ని యవ్వనంగా ఉంచుంతుంది.
శరీరం లోపల వాపులు, నొప్పులు వంటివి ఊబకాయం, క్యాన్సర్ వంటి ప్రమాద సమస్యలకు కారణమవుతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ వాపులు, నొప్పులు తగ్గించడంలోనూ.. శరీరంలో అంతర్గత జబ్బులు నయం చేయడంలోనూ సహాయపడతాయి.
నువ్వులలో విటమిన్-బి1, బి3, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరం అన్ని విధులను సక్రమంగా నిర్వర్థించేందుకు దోహదం చేస్తాయి. విటమిన్-బి లోపం వల్ల శరీరంలో బలహీనత దారుణంగా పెరుగుతుంది.
నువ్వులు తింటే మహిళలలో నడుము భాగం బలంగా మారుతుంది. ఇది నెలసరి సమస్యలు, గర్బం దాల్చడం, ప్రసవం తరువాత కూడా నడుము బలంగా ఉండటంలో సహాయపడుతుంది.
కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు తింటే ఎముకలు బలంగా ఉక్కులాగా మారతాయి. ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి, ఎముకలు పెలుసుబారడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మహిళల్లోచాలామందిలో కనిపించే రక్తహీనత సమస్యకు నువ్వులు చెక్ పెడతాయి. నువ్వులలో ఉండే ఐరన్ రక్తహీనతకు చెక్ పెడుతుంది.
రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే రోజూ కాసిన్ని నువ్వులు తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
*నిశ్శబ్ద.