అధికారంలోకి వచ్చిన టీడీపీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అనుమతుల్లేవనే కారణంతో ప్రభుత్వం కూల్చేసింది. కూల్చివేతతో పాలన మొదలు పెట్టారనే అపప్రదను ప్రభుత్వం మూటకట్టుకుంది.
ఈ నేపథ్యంలో వినుకొండలో వైసీపీ కార్యకర్తను రషీద్‌ను చంపడం, అలాగే పుంగనూరులో రాజంపేట ఎమ్మెల్యే మిధున్‌రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టడం, ఆయన కారును కాల్చివేయడాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాగైతే వైసీపీ శ్రేణులు మనో స్థైర్యాన్ని కోల్పోతాయనే భయం జగన్‌ను వేటాడుతోంది. దీంతో ఆయన పోరాటానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 24న ధర్నాకు పిలుపు ఇచ్చారు. అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను జగన్ కలవనున్నారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని గవర్నర్‌కు జగన్ నేతృత్వంలో ఫిర్యాదు చేయనున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ సాగిస్తున్న అరాచకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు జగన్ విన్నవించనున్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాతైనా పరిస్థితుల్లో ఏ మేరకు మార్పు వస్తుందో చూడాలి.