YSR Road Accident : వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ, ఎర్రగుంట్ల తహసీల్దార్ ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరు, కడపకు చెందిన 11 మంది ప్రొద్దుటూరు నుంచి మల్లెలకు పాసింజర్ ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో ఆటో లారీని తప్పించబోతుండగా ఎర్రగుంట్ల నుంచి వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఆటోను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్రైవర్‌తో సహా ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన వారు కడప ఆజాద్ నగర్‌కు చెందిన మహమ్మద్ (25), హసీనా (25), అమీనా(20), షాకీర్(10)లుగా పోలీసులు గుర్తించారు.