ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ సాధించిన ఘనవిజయం మూమూలుది కాదు. ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్లకుపైగా కలెక్షన్ సాధించి టాప్ హీరోలకు షాకిచ్చింది. ‘హనుమాన్’ చిత్రం 300 కేంద్రాల్లో 30 రోజులు పూర్తి చేసుకొని తన స్టామినా ఏమిటో నిరూపించింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్సే జరుగుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం నితిన్ హీరోగా కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన ‘శ్రీఆంజనేయం’ చిత్రాన్ని ఈ డిస్కషన్‌లోకి తీసుకొస్తున్నారు. టాలీవుడ్‌లో గ్రాఫిక్స్ ఎక్కువగా వినియోగంలో లేని రోజుల్లోనే కృష్ణవంశీ ఒక అడుగు ముందుకు వేసి అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే అతను ఊహించిన విధంగా సినిమా విజయం సాధించలేదు. అతని కెరీర్‌లో ఓ డిజాస్టర్‌గా ఆ సినిమా మిగిలిపోయింది.
ఇదిలా ఉంటే.. ఈమధ్య నెటిజన్లు ‘హనుమాన్’ కంటే ‘శ్రీఆంజనేయం’ చాలా గొప్ప సినిమా అని కృష్ణవంశీ ఎక్స్ పేజీలో కామెంట్స్ పెడుతూ.. ఆ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటూ వారిని దూషిస్తున్నారు. ఎంతో కాలంగా వస్తున్న ఈ కామెంట్స్‌పై కృష్ణవంశీ తాజాగా స్పందించాడు. ‘ప్లీజ్ ప్రేక్షకుల్ని తిట్టకండి. వాళ్ళ నిర్ణయం ఎప్పటికీ తప్పుకాదు. ‘శ్రీఆంజనేయం’ సినిమాలో ఏదో లోపం జరిగింది. సినిమాలోని కొన్ని అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదు. అయినా, మీరు పెట్టిన కామెంట్స్‌కి థాంక్స్’ అని సమాధానమిచ్చాడు.
మరో నెటిజన్ ‘శ్రీఆంజనేయం’లో ఛార్మి క్యారెక్టర్ గురించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆమె క్యారెక్టర్ సినిమాకి చాలా మైనస్ అయిందని, ఆ క్యారెక్టర్ తీరు చిరాకు పుట్టించేలా ఉందని, అందుకే సినిమా ఫ్లాప్ అయిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దానికి ‘గాడ్ బ్లెస్ యు’ అని ఒక్క ముక్కలో సమాధానమిచ్చాడు కృష్ణవంశీ. ఒక సినిమా విషయంలో ఎవరెన్ని మాట్లాడినా ప్రేక్షకులదే తుది నిర్ణయం అవుతుంది. అయితే 20 సంవత్సరాల క్రితం గ్రాఫిక్స్‌తో అలాంటి ప్రయోగం చేసిన కృష్ణవంశీని మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే. కృష్ణవంశీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 20 సంవత్సరాలు అడ్వాన్స్‌గా ఆ సినిమా తీశాడని కూడా చెప్పొచ్చు.