సంచలనం కోసమో తన కుమారుడు మోహిత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై పద్మావతి మహిళా వర్సిటీ వద్ద దాడి కేసులో 37వ నిందితుడిగా మోహిత్‌రెడ్డి పేరు చేర్చారు. ఎన్నికల్లో చంద్రగిరి వైసీపీ అభ్యర్థిగా మోహిత్‌రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్నేహితుడి వివాహం నిమిత్తం బెంగళూరు నుంచి దుబాయికి వెళుతుండగా తిరుపతి పోలీసులు మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను తిరుపతికి తరలించారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఎస్వీయూ పోలీస్‌స్టేషన్ ఎదుట వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టాయి.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో విద్యనభ్యసంచిన తన కుమారుడు స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు దుబాయి వెళ్తుండగా అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఇంతకాలం ఊళ్లోనే పోలీసుల ఎదుట తిరుగుతున్నా ఎందుకు అదుపులోకి తీసుకోలేదని నిలదీశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే తన కుమారుడిపై అన్యాయంగా కేసు నమోదు చేశారన్నారు.
కేసులో 37వ నిందితుడైన మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేసి జడ్జి ఎదుట హాజరు పరిచి వుంటే ఏం జరిగేదో తెలిసేదని చెవిరెడ్డి అన్నారు. జడ్జి ఎదుట హాజరుపరిచి వుంటే పోలీసుల తప్పుడు కేసు ఏంటో ప్రపంచానికి తెలిసేదని ఆయన అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన సంగతి పోలీసులు, ప్రభుత్వానికి తెలుసని ఆయన అన్నారు. మోహిత్‌రెడ్డికి 41సీ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేయడం గమనార్హం.