ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి రూ.750 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఐదు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
ఐదు ఇండియన్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయిన ‘సలార్’ను రెండు వారాల తర్వాత హాలీవుడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఆమధ్య స్ప్రెడ్ అయింది. సౌండ్‌తోపాటు డబ్బింగ్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకొని హాలీవుడ్ సినిమాల తరహాలో ‘సలార్’ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి. మేకర్స్ ఆశించినట్టుగా హాలీవుడ్ వెర్షన్‌ను రిలీజ్ చెయ్యలేకపోయారు. ఇప్పుడు ఓటీటీలోనే ఇంగ్లీష్ వెర్షన్ లభ్యమవుతోంది. మరి ఈ వెర్షన్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే.. సలార్ సీక్వెల్ ఎనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ సెకండ్ పార్ట్ పేరు శౌర్యాంగపర్వంగా ఎండ్ టైటిల్స్‌లోనే రివీల్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడా పనిమీదే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘సలార్’ సీజ్‌ఫైర్‌ను చూసిన వారికి కొంత కన్‌ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవమే. అయితే మొదటి భాగం కేవలం ఒక శాంపిల్‌గా ఉంటుందని, అసలు కథంతా సెకండ్ పార్ట్‌లోనే ఉందని ప్రశాంత్ నీల్ స్వయంగా చెప్పిన నేపథ్యంలో అందరి దృష్టీ ఇప్పుడు సెకండ్ పార్ట్ పైనే ఉంది. 2025లో రెండో భాగాన్ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు.