ఒక ఎన్నికల్లో ఉన్న ఓటర్ల మొత్తం సంఖ్య 841. అందులో ఒకే పార్టీకి ఉన్న బలం 615 ఓట్లు. వారి ప్రత్యర్థులు అందరూ కలిస్తే ఉన్న బలం కేవలం 215 ఓట్లు. 11 స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఏం జరుగుతుంది? 615 ఓట్ల బలం ఉన్న పార్టీ మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తుంది! ఏకగ్రీవంగా నెగుతుంది! తమ ప్రతినిధిని సభలో అడుగు పెట్టిస్తుంది.
అయితే ఇందుకు భిన్నంగా కేవలం 215 సీట్ల బలం మాత్రమే ఉన్న పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగితే గనుక ఆ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? మెజారిటీ బలం ఉన్న పార్టీ నుంచి సభ్యులను తమ పార్టీలోకి పిరాయింపు చేసుకోవడానికి కుట్ర రచన చేస్తున్నారని గ్రహించాలి! ఈ సిద్ధాంతం ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో నిరూపణ అవుతోంది.
ఎలాగంటే.. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీ నుంచి జనసేనలోకి ఫిరాయించడం వలన ఆయన అనర్హుడని ప్రకటించడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఆ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెసుకు 615 ఓట్ల బలం ఉంది. తెలుగుదేశానికి ఉన్న బలం కేవలం 215 మాత్రమే. అయినా సరే వారు ఏ నమ్మకంతో తమ అభ్యర్థిగా గండి బాబ్జిని పోటీకి సిద్ధం చేస్తున్నారనేది అర్థం కాని సంగతి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గుడివాడ అమర్నాథ్ గాని బూడి ముత్యాల నాయుడు గాని పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కేవలం నాలుగోవంతు బలం మాత్రమే ఉన్నప్పటికీ అధికార కూటమి పోటీలకు దిగుతున్నదంటే.. ఫిరాయింపుల మీద ఆశతో మాత్రమే అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది.
గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా బలం లేకపోయినా సరే తెలుగుదేశం పంచుమర్తి అనురాధను బరిలోకి దింపింది. ఒకవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకుంది. తెలుగుదేశం ఇప్పుడు కూడా ప్రలోభాల ద్వారా క్రాస్ వోటింగ్ లేదా బెదిరింపుల ద్వారా ఏకంగా పార్టీ ఫిరాయించేలా చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరితో ఓట్లు వేయించుకుని విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఫిరాయింపుల మీద ఆశ లేకపోతే అసలు గండి బాబ్జిని బరిలోకి దింపే వారే కాదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తెలుగుదేశం కలగంటున్న ఫిరాయింపు రాజకీయాలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసినట్లయితే.. స్థానిక సంస్థల ప్రతినిధుల్నిరాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపజేసుకోవడానికి ఇది శ్రీకారం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
The post సామూహిక ఫిరాయింపులకు ఇది శ్రీకారమా? appeared first on Great Andhra.