మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గాంజా శంకర్’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే అధిక బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ అటకెక్కినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో ‘గాంజా శంకర్’ టీంకి మరో షాక్ తగిలింది.
‘గాంజా శంకర్’ మూవీ టైటిల్‌పై తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్రబృందానికి నోటీసులు పంపింది. ఫస్ట్ హై పేరుతో ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని, దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది. సినిమా ఆర్టిస్టులు, ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.
‘గాంజా శంకర్’ సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ.. ఒకవేళ ఆ సినిమా ఆగిపోకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్ర నార్కొటిక్ బ్యూరో(TSNAB) నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ కి మెగా షాక్ తగినట్లే అవుతుంది. మరి దీనిపై సితార ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.