జాతరకు బీజం పడింది ఇలానంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ శివారులో గల పులిగుండ్ల సమీపంలో 40 సంవత్సరాల కిందట ఓ గొర్రెల కాపరి మేకలను మేపుతుండుగా పెద్ద గుండు ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయి. ఈ విషయం కాస్త గ్రామస్థులకు తెలియగానే అక్కడికి గ్రామస్థులందరూ తండోప తండాలుగా తరలి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర కొన్ని రోజుల ముందే ఈ ప్రాంతంలో పసుపు, కుంకుమ ముద్దలు కనిపించాయని, అమ్మవార్ల మహిమతోనే పసుపు, కుంకుమ కనిపించాయని, రెండెళ్లకోసారి గ్రామంలో జాతర జరిపించాలని పూనకం వచ్చిన ఓ మహిళ చెప్పింది. దీంతో ఆమె మాటలతో గ్రామస్థులకు నమ్మకం ఏర్పడింది. సమ్మక్క తల్లి పులి పైన స్వారీ చేస్తుందని అందుకే గ్రామంలోని పులిగుండ్ల వద్ద పసుపు రూపంగా దర్శన మిచ్చిందని గ్రామస్తులకు నమ్మకం కలిగింది. దీంతో గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్టాలని సంకల్పించారు. ఆ సమయంలో తలో కొంత చందాలు వేసుకోని పులిగుండ్ల సమీపంలో 14 ఎకరాల స్థలాన్ని సేకరించి, 1984లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వారి మేన కోడలు లక్ష్మి, పగిడిద్దరాజు (నాగుపాము) ప్రతిమలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారంలో నిర్వహించే ముహూర్తానికి జాతరను నిర్వహించడం, సమ్మక్క, సారలమ్మలు గద్దనెక్కడం, భక్తులు మొక్కులు తీర్చుకోవడం అనవాయితీగా మారిపోయింది.
Source link