దివ్యాంగుల రిజర్వేషన్లపై సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగులకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె మాత్రం తగ్గేదే లే అనే రేంజ్లో దివ్యాంగుల రిజర్వేషన్లపై చర్చకు తెరలేపారు. దివ్యాంగుల రిజర్వేషన్లపై ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు ఏంటో ముందు తెలుసుకుందాం.
‘ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుంది. దీనికి శారీరక దృఢత్వం అవసరం.. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుంది. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను. కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా?’ అని స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
స్మితా పోస్టుపై ప్రముఖ మోటివేటర్, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత తదితరులు తీవ్రంగా స్పందించారు. బాలలత స్వయంగా దివ్యాంగురాలు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడ్డానికి స్మితకు ఉన్న అర్హతలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జ్యుడిషియరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు స్మితా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీల్డ్‌లో పరిగెత్తుతూ స్మితా ఎంతకాలం పని చేశారో చెప్పాలని ఆమె నిలదీయడం గమనార్హం. అసలే వివక్షకు గురవుతున్న వికలాంగులను ఆమె మాటలు మరింత కుంగదీశాయని వాపోయారు.
కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వెంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సివిల్స్ పరీక్ష రాద్దామని, తనకంటే ఎక్కువ మార్కులు సాధించాలని స్మితాకు బాలలత సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అంగవైకల్యంతో బాధపడుతూ విజయాలు సాధించిన జైపాల్‌రెడ్డి, స్టీఫెన్ హాకింగ్, సుదా చంద్రన్ తదితరుల గురించి ఆమె ఉదహరించారు. పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారమన్నారు. 24 గంటల్లోపు తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం స్మితాపై చర్యలు తీసుకోకపోతే ట్యాంక్ బండ్‌పైన నిరసన తెలియజేస్తామని బాలలత హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో స్మితా మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. మళ్లీ ఎక్స్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో తనను విమర్శించే వారికి ఆమె నేరుగా ఒక ప్రశ్న సంధించారు. స్మితా ఏమంటారంటే…
ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌తో పాటు రక్షణ లాంటి రంగాల్లో దివ్యాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో తనను ప్రశ్నిస్తున్న వారు సమాధానం చెప్పాలని స్మితా డిమాండ్ చేయడం గమనార్హం. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ లాగే ఐఏఎస్ కూడా అంతేకదా అని ఆమె నిలదీశారు. తన అభిప్రాయాన్ని పరిశీలించాలని హక్కుల కార్యకర్తల్ని కోరుతున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదని ఆమె స్పష్టం చేశారు.
దివ్యాంగులనే జాలి, దయ లాంటి వాటికి తన మనసులో చోటు లేదని స్మితా సబర్వాల్ తేల్చి చెప్పారు. స్మితా లేవనెత్తిన అంశాలు కూడా విలువైనవే. స్మితా లేవనెత్తిన అంశాలపై విమర్శలు చేయడం ఓకే. అలాగే ఐఏఎస్ లాగే ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు సాధించుకోవడంపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.