కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం బనవనూరు గ్రామానికి చెందిన దేవి కుమారి అనే యువతి చదువుపై మక్కువ ఎక్కువ ఆమె కష్టపడి ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. పేద కుటుంబం కావడంతో ఉన్నత చదువుకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అయితే దేవి కుమారికి మాత్రం చదవాలని ఉంది. బీఎస్సీ, ఆపై ఉన్నత విద్యను అభ్యసించాలని ఉంది. కానీ పేదరికం అడ్డు వస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదని, తనకు బీఎస్సీ చదవాలని ఉందనే విషయాన్ని తెలుపుతూ ఉన్న వీడియోను సోషల్ మీడియా ఎక్స్ లో శైలు చౌదరి అనే యువతి పోస్టు చేశారు. దేవి కుమారికి ఏదో ఒకటి చేయండని పోస్టులో రాశారు. దయచేసి ఆ అమ్మాయికి సహాయం చేయండని పోస్టులో పేర్కొంది. ఈ పోస్టును యాక్టర్ సోనూసూద్‌కు ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన యాక్టర్ సోనూసూద్ “దేవి కుమారి కాలేజీ వెళ్లేందుకు సిద్ధంగా ఉండు, నీ చదువును ఆపొద్దు” అని రిప్లై ఇచ్చారు.