ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మొండితనం వీడుతోందా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. ఇంతకాలం జగన్ రాజకీయంగా మడి కట్టుకుని కూచున్నారు. రాజకీయాల్లో ఇది సరైన విధానం కాదని వైసీపీ నేతలు చెప్పినా, జగన్ వినిపించుకోలేదు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం వల్ల ఇతర పార్టీలకు వైసీపీ చేరువ కాలేకపోయింది.
అయితే రాజకీయాల్లో ప్రజాదరణ పొందినంత వరకే ఎవరైనా దగ్గరికి తీస్తారనే, అవసరం లేదనుకుంటే దూరం పెడతారనే జ్ఞానోదయాన్ని జగన్‌కు ఎన్నికల ఫలితాలు కలిగించాయి. జాతీయస్థాయిలో వైసీపీకి ఒక వేదిక, మద్దతు ఉండాలని జగన్ భావించారు. దీంతో ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కట్టి, పోరాడుతున్న ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి పని చేయడానికి జగన్ నిర్ణయించడం విశేషం.
జగన్‌లోని ఈ మార్పుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు అఖిలేష్‌యాదవ్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్ తదితరుల పార్టీలు మద్దతుగా నిలిచాయి. వీళ్లంతా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకులే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మీడియా సమావేశంలో ధర్నాకు కాంగ్రెస్ హాజరు కాకపోవడం, ఇండియా కూటమిలోని పార్టీల నేతలు పాల్గొనడాన్ని ఎలా చూడాలనే జర్నలిస్టుల ప్రశ్నకు జగన్ కీలక సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించామని, అయితే రాలేదన్నారు. ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా రాహుల్‌గాంధీ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించడం గమనార్హం. ఇదే సందర్భంలో తమకు అండగా నిలిచిన ఇండియా కూటమిలోని నేతలతో కలిసి భవిష్యత్‌లో పోరాడుతానని జగన్ స్పష్టం చేశారు. ఇంతకాలం బీజేపీ అనుకూల ముద్ర వైసీపీపై వుంది. ఇకపై అలాంటి రాజకీయ వాతావరణం ఉండకపోవచ్చు.
కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచన జగన్‌లో రావడంపై వైసీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
The post హమ్మయ్య… జగన్ మొండితనం వీడుతోంది! appeared first on Great Andhra.