ఎన్టీఆర్(NTR) తర్వాత నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ(Balakrishna), జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు హీరోలుగా పరిచయమై సత్తా చాటారు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే మరో నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. అతను ఎవరో కాదు.. హరికృష్ణ మనవడు.
హరికృష్ణకు ముగ్గురు కొడుకులు కాగా.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు. పెద్ద కొడుకు జానకిరామ్ మాత్రం నిర్మాణానికే పరిమితమయ్యారు. 2014 లో రోడ్డు ప్రమాదానికి గురై ఆయన కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ బాధ్యతను దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నట్లు సమాచారం.
నందమూరి(Nandamuri) కుటుంబంతో వై.వి.ఎస్. చౌదరికి మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణతో మంచి బాండింగ్ ఉండేది. వీరి కలయికలో వచ్చిన ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే వరుస పరాజయాలు పలకరించడంతో కొన్నేళ్లుగా వై.వి.ఎస్. చౌదరి మెగాఫోన్ పట్టలేదు. మరోవైపు హరికృష్ణ కూడా 2018 లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే హరికృష్ణ లేనప్పటికీ ఆయన మీద అభిమానంతో ఇప్పుడు జానకిరామ్ పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యత వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నాడట.
హరికృష్ణ మనవడు ఓ మంచి లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నట్లు వినికిడి. 2006లో రామ్ పోతినేనిని హీరోగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్ రూపొందించిన ప్రేమ కథా చిత్రం ‘దేవదాసు’ ఘన విజయం సాధించింది. చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న వై.వి.ఎస్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.
కాగా, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఎన్టీఆర్ గా జానకిరామ్ తనయుడు ప్రేక్షకులకు పరిచయమే. 2015లో బాలల చిత్రంగా రూపొందిన ‘దానవీరశూరకర్ణ’లో కృష్ణుడి పాత్ర పోషించాడు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.