ఇక పశువుల కొట్టాలకు, ఇండ్ల స్థలాలకు, పెండ్లి అయ్యి వేరే గ్రామాలకు వెళ్లిన మహిళలకు పరిహారం ఇవ్వకపోవడంతో గతంలోనే వారు ధర్నాలు, నిరసనలు చేపట్టారు. పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టులో నీటిని నింపవద్దని గ్రామస్తులు అడ్డుకుంటే, వారిలో కొంతమందిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టించి జైల్లో వేయించింది. బలవంతంగా గ్రామాలూ కాలి చేయించి, ఇండ్లు కూల్చివేసి, ప్రాజెక్టులో నీటిని నింపటం ప్రారంభించారు. ఒక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన గౌరవెల్లి హుస్నాబాద్ నియాజకవర్గానికి ఒక కల్పతరువు లాగా మారనున్నది ప్రచారం చేసుకుంటుండగా, గౌరవెల్లి రైతుల నిర్ణయం ఆ పార్టీకి ఒక ఆశనిపాతంలా మారింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాల కంటే ఎక్కువ భూమికి సాగు నీరు, ఈ ప్రాంతానికి మొత్తం తాగు నీరు అందిస్తున్నాము అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకొని ఎన్నికల్లో లబ్ది పొందాలనుకుంటుంది, అయితే ఆ రైతులే సతీష్ కుమార్ కి వ్యతిరేకంగా పోటీచేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఎటుపాలుపోని పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా రైతులతో కలిసి మాట్లాడి వారికీ నచ్చజెప్పాలని ఆలోచన చేస్తున్నది.